ది లయన్ కింగ్ - "సింబా"ను కచ్చితంగా చంపేస్తాడు!
- ఆశ్చర్యపరిచేలా సింహాల జీవన విధానం! - వయసొచ్చినవి గెటౌట్ అయిపోవాల్సిందే!! - ఇంకా మరెన్నో ఆసక్తికర అంశాలు!!!

Published : October 12, 2025 at 4:29 PM IST
Lions life style : అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంటారు కొందరు మనుషులు! అయితే, మానవుల్లోనే కాదు సింహాల్లోనూ ఇదే తరహా పోరాటం ఉంటుంది! ఆధిపత్యం కోసం ఎదురు దాడి చేయడం నుంచి, పిల్లల్ని చంపడం వరకు ఎంతకైనా తెగిస్తాయి! మరి, సింబాలను చంపేది ఎవరు? తండ్రి ఎక్కడ ఉంటాడు? ఆ సమయంలో తల్లి ఏం చేస్తుంది? అసలు ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
కొన్ని రకాల జీవులు పుట్టగానే తమ పిల్లల్ని చంపేస్తుంటాయి. దీనికి కారణం ఆకలి! ప్రసవించిన తర్వాత తీవ్ర ఆకలితో ఉండే తల్లులు, ఆ క్షుద్భాదను భరించలేక పిల్లల్నే చంపి తినేస్తాయి. సొరచేపలు, ధ్రువపు ఎలుగుబంట్లు, పాములు వంటివి ఈ జాబితాలో ఉంటాయి. అయితే, సింహాలు కూడా పిల్లలను చంపేస్తాయి. కానీ తినడానికి కాదు. అధికారం కోసం! ఈ పని చేసేది కూడా తల్లీతండ్రి కాదు. ఓ కొత్త సింహం! ఇలాంటి సింహాలనే లయన్ కింగ్స్ గా చెప్పుకుంటారు! ప్రాణాలు కోల్పోయే ఆ పిల్లలే "సింబా"లవుతాయి!!
ఎందుకిలా?
ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అన్నది తెలుసుకోవాలంటే సింహాల జీవన విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలంటున్నారు నిపుణులు. అడవిలో ఉండే సింహాలన్నీ ఒకే గుంపుగా ఉండవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో గుంపు నివసిస్తుంది. ఒక గుంపులో సాధారణంగా రెండు నుంచి మూడు మగసింహాలు ఉంటాయి. ఆడసింహాలు ఐదు నుంచి 12 వరకు ఉంటాయి. పిల్లలు నాలుగు నుంచి 10 వరకు (రెండేళ్ల లోపు వయసు) ఉంటాయి. ఆ సమూహాన్ని సంరక్షించడమే మగ సింహాల పనిగా ఉంటుందని చెబుతున్నారు.
రోజులు ఇలా గడుస్తున్న క్రమంలో పిల్ల సింహాలు పెద్దవైపోతుంటాయి. వాటి వయసు మూడేళ్లు దాటకుండానే పెద్ద సింహాలు వాటిని గుంపు నుంచి బయటకు వెళ్లగొడతాయి. ఇది ప్రకృతి ధర్మంగానే ఉంటుందట. ఆ గుంపులోని ఆడ సింహాలు వీటికి తోబుట్టువులుగా, తల్లి, రక్తసంబంధీకులుగా ఉంటాయి. అందుకే మగ పిల్లలకు వయసు రాగానే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా అన్ని గుంపుల్లోనూ జరుగుతూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన యువ సింహాల్లో మూడు నాలుగు కలిసి ఒక జట్టుగా ఏర్పడతాయి. ఇవి ఒక గుంపుపై దాడి చేస్తాయి. ఆ సమూహంలోని మగ సింహాలతో భీకర యుద్ధం చేస్తాయి. ఈ పోరాటంలో గెలిస్తే ఆ గుంపునకు ఇవి కొత్త రాజులవుతాయట! ఓడిపోతే గజినీలా మరోసారి ఇదే గుంపుపై దండయాత్ర చేయడమో, లేదంటే మరో సమూహంపై దాడికి సిద్ధమవడమో చేస్తాయట.
సింబాల హత్య :
ఇలా దాడి చేసి ఆ ప్రాంతాన్ని గెలిచిన సింహాలు.. ఆ గుంపులో ఉన్న మగ పిల్ల సింహాలను చంపేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ పిల్లలు తమ సంతానం కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఆడ సింహాలతో త్వరగా శారీరకంగా కలిసేందుకు పిల్లలను చంపేస్తాయట. తద్వారా ఆ గుంపులో త్వరగా తమ వారసత్వాన్ని పెంచుకునేందుకు చూస్తాయట. ఇలాంటి పరిస్థితుల్లో బలయ్యే పిల్ల సింహాలు సాధారణంగా 9 నెలల వయసులోపే ఉంటాయట. ఎందుకంటే పిల్లలు ఆ వయసు వరకే పాలు తాగుతాయి. ఈ వివరాలను africageographic.com ప్రచురించిన "Understanding Lion Infanticide" ఆర్టికల్ ధ్రువీకరిస్తోంది.
ఆడ సింహాల అలర్ట్ :
కొత్త సింహాలు తమ సమూహంపై దాడికి వచ్చినప్పుడు మగ సింహాలు వాటితో పోరుకు సిద్ధమవుతాయి. ఆ సమయంలో ఆడ సింహాలు వెంటనే అలర్ట్ అయిపోతాయి. తమ పిల్లలను సేఫ్ జోన్లోకి తీసుకెళ్తాయి. వాటికి కనిపించకుండా దాచేస్తాయి. అవసరమైతే కొత్త సింహాలతో ప్రత్యక్షంగా యుద్ధం చేయడానికి కూడా సిద్ధమవుతాయి. అయితే.. కొత్త సింహాలు గెలిచి ఆ టెరిటరీని స్వాధీనం చేసుకుంటే మాత్రం, ఆడ సింహాలు కూడా అనివార్యంగా వాటి ఆధీనంలోకి వెళ్లిపోతాయట. సింహాల జీవన విధానంపై పరిశోధన చేసిన అమెరికన్ సైంటిస్టులు క్రేగ్ పాకర్, ఆన్నీ ప్యూసీ ఈ వివరాలను వెల్లడించారు. 1983లో "Adaptations of Female Lions to Infanticide by Incoming Males" అనే పేరుతో థీసెస్ కూడా ప్రచురించారు.
కట్టుదిట్టమైన భద్రత :
పైన చెప్పుకున్న విధంగా కొత్త సింహాలు గుంపుపై దాడి చేయడం సర్వ సాధారణం కాబట్టి.. ప్రతి గుంపులోని మగ సింహాలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉంటాయి. తమ సమూహ రక్షణే వాటి ప్రథమ, ఇంకా అంతిమ కర్తవ్యం. అందుకే అవి వేటకు కూడా వెళ్లవు. ఆడ సింహాలే వేటాడి ఆహారాన్ని తీసుకొస్తాయి. ఒక గుంపులో మూడు మగసింహాలు ఉన్నాయనుకుంటే ఒకటి తమ భౌగోళిక ప్రాంతం (టెరిటరీ) చుట్టూ గస్తీ నిర్వహిస్తుంది. ఈ టెరిటరీ విస్తీర్ణం తక్కువలో తక్కువ 20 చదరపు కిలోమీటర్ల నుంచి 400 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుందట. ఆ సరిహద్దులో తిరుగుతూ వేరే సింహాలు తమ ప్రాంతంలోకి రాకుండా చూస్తూ ఉంటుంది. రెండో సింహం పిల్లలు, ఇతర ఆడ సింహాల రక్షణ కోసం వాటి వెంట ఉంటుంది. హైనాలు వంటివి దాడి చేయకుండా కనిపెట్టుకొని ఉంటుంది. మిగిలిన మూడో సింహం విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇలా షిఫ్ట్ వైజ్‌గా డ్యూటీ చేస్తూ ఉంటాయి.
టెరిటరీని ఎలా గుర్తిస్తాయి? :
మనుషులు భూమికి సరిహద్దులు గీసుకున్నట్టుగా, కంచెలు వేసుకున్నట్టుగా సింహాలు, ఇతర జంతువులు వేసుకోలేవు. మరి, అలాంటప్పుడు అవి తమ ప్రాంతాన్ని, పరాయి వాళ్ల ప్రాంతాన్ని ఎలా నిర్ధారించుకుంటాయి? అనే సందేహం సహజంగా వస్తుంది. కానీ, అవి ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాయి. తాము నివాసమున్న ప్రాంతాన్ని జంతులు ఒక్కసారి చూస్తే మరిచిపోవట. ఇక, వేరే ప్రాంతంలోని సింహాలు తమ టెరిటరీలోకి రాకుండా ఉండే పనిని గస్తీ నిర్వహించే సింహాలు చూస్తాయని చెప్పుకున్నాం. ఇవి తమ సరిహద్దుల వెంట స్పష్టమైన గుర్తులను వదులుతూ ఉంటాయి. ఉదాహరణకు మూత్ర విసర్జన చేస్తాయి. ఇంకా చెట్లకు తమ తల, శరీరం రుద్దడం వంటివి చేస్తుంటాయి. ఇలా చేసినప్పుడు వాటి వెంట్రుకలు చెట్లకు అంటుకుంటాయి. అటువైపుగా వచ్చిన కొత్త సింహాలకు దీన్ని సరిహద్దుగా హింట్ ఇస్తాయి. ఇంకా గర్జన ద్వారా కూడా తమ టెరిటరీని చాటి చెబుతాయి. మగ సింహం గర్జిస్తే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు స్పష్టంగా వినిపిస్తుందట. రాత్రిపూట ఈ గర్జనలు చేయడం ద్వారా తమ సమూహం ఎంత పెద్దదో కూడా అవతలి వాటికి అర్థమయ్యేలా చెబుతాయట!
భీకర పోరాటం :
యుక్తవయసుకు వచ్చిన సింహాలన్నీ గుంపులో నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలా వెళ్లిన సింహాలకు ఆడ తోడు కావాల్సిందే కాబట్టి మరో గుంపుపై దాడి చేయాల్సిందే. సో.. డూ ఆర్ డై అన్నట్టుగానే సింహాల జీవితం ఉంటుంది. కొత్త సింహాలు ఒక సమూహంపై దాడికి దిగాయంటే అక్కడ సాగే పోరాటం అత్యంత భీకరంగా ఉంటుంది. ఈ పోరాటంలో చాలా సార్లు సింహాలు చనిపోతుంటాయి. కొత్తసింహాలు ఓడిపోతే పారిపోతాయి. కానీ, ఆ గుంపులో ఉన్న మగసింహాలు ఓడిపోతే, ఆ సమూహాన్నే వీడిపోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లేదంటే గాయాలపాలై మరణిస్తాయి. అది కూడా కాకుంటే బయటకు వెళ్లిపోయి వేరే మగసింహాలతో కలిసి జట్టు ఏర్పాటు చేసి, మరో గుంపుపై దాడి చేయాల్సి ఉంటుంది. వయసు కారణంగానో, గాయాల కారణంగానో ఈ అవకాశం కూడా లేని సింహాలు ఒంటరిగానే మిగిలిపోయి చివరకు ప్రాణాలు కోల్పోతాయి.
ఈ విధంగా మగ సింహాలు అనునిత్యం ప్రమాదకర పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంటూ జీవన సాగిస్తుంటాయని చెబుతున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గుంపును, తమ ఆధిపత్యాన్ని రక్షించుకునేందుకు పోరాడతాయి కాబట్టే లయన్‌ను.. కింగ్ గా భావిస్తారని అంటున్నారు!

