Lemon Rice with Pre Mix: 'నిమ్మకాయ పులిహోర' ఈ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. పూజలు, నోములు, పండగల సమయాల్లో ఈ రైస్‌ను మెజార్టీ పీపుల్ కచ్చితంగా ప్రిపేర్ చేస్తుంటారు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, వడ, దోశల్లాగే ఈ రైస్‌ను కూడా తరచూ చేసుకుంటుంటారు. అయితే ఇంతవరకు బానే ఉన్నా, నిమ్మకాయ పులిహోర అంటే అన్నం వండి, నిమ్మకాయలు పిండి, ఆ రసాన్ని అన్నానికి పట్టించాలి. ఆ తర్వాత తాలింపు పెట్టుకుని తినాలి. ఇదంతా కూడా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అయితే ఇలా నిమ్మకాయలు పిండి తాలింపు పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం క్షణాల్లో పులిహోర చేసుకుని తినొచ్చు. మీరు విన్నది నిజమే. కానీ అలా తినాలంటే ముందే లెమన్ రైస్ ప్రీమిక్స్ తయారు చేసి స్టోర్ చేయాలి. ఇలా చేసుకున్న మిశ్రమంతో ఎప్పుడంటే అప్పుడు నిమ్మకాయ పులిహోర తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. పులిహోర ప్రియులకు ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ లెమన్ పులిహోర ప్రీమిక్స్కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- పల్లీలు - అర కప్పు
- నూనె - అర కప్పు
- శనగ పప్పు -2 టేబుల్‌స్పూన్లు
- మినప్పప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - టేబుల్‌స్పూన్
- జీలకర్ర - టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 4
- ఎండుమిర్చి - 3
- అల్లం - చిన్న ముక్క
- కరివేపాకు - గుప్పెడు
- పసుపు - చెంచా
- ఇంగువ - ముప్పావు చెంచా
- ఉప్పు -రుచికి తగినంత
- నిమ్మరసం - అర కప్పు

తయారు చేసే పద్ధతి:
- తాజా అల్లాన్ని పొట్టు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే తాజా నిమ్మకాయల నుంచి రసం తీసి పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- అదే నూనెలోకి ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.

- తాలింపు గింజలు వేగుతుండగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి.
- అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అలాగే ఇందులోకి ముందే వేయించి పక్కన పెట్టిన పల్లీలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి.

- ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. అస్సలు వేడి అన్నది లేకుండా ఉన్నప్పుడు తడి, గాలి చొరబడని జార్లో ఈ ప్రీమిక్స్ పోసి ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే సరి. లెమన్ రైస్ ప్రీమిక్స్ రెడీ. ఈ ప్రీమిక్స్ సుమారు నాలుగు నెలలు నిలవ ఉంటుంది.

- పులిహోర ఎలా కలపాలంటే, ఓ వెడల్పాటి ప్లేట్లోకి పొడిపొడిగా ఉండే అన్నం తీసుకుని కాస్త చల్లార్చాలి.
- రైస్ గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ ప్రీ మిక్స్ వేసి కలిపి ఓ 5 నిమిషాలు పక్కన పెట్టి, ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ.

చిట్కాలు:
- ఈ లెమన్ ప్రీమిక్స్ ఉపయోగించే నిమ్మకాయలు మరీ పచ్చిగా, మరీ పండుగా ఉండకుండ చూసుకోవాలి. కాయ కాస్త లావుగా ఉండి పసుపు కలర్లో ఉన్న తాజా నిమ్మకాయలు తీసుకుంటే సరి.
- ఈ కొలతల ప్రకారం ఇంకా ఎక్కువ పరిమాణంలోనూ చేసుకుని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.
- ఇక రెండు కప్పుల అన్నంలో 3 టేబుల్‌స్పూన్ల లెమన్ ప్రీమిక్స్ కలిపితే సరిపోతుంది.
- అన్నాన్ని అప్పటికప్పుడు వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాత్రి మిగిలిన అన్నంలో కూడా ఈ ప్రీమిక్స్ కలుపుకుంటే పులిహోర రెడీ.

రుచికరమైన "సగ్గుబియ్యం పూరీలు" - పిండిని ఇలా కలిపితే బాగా పొంగుతాయి! - నూనె పీల్చవు!
శనగపప్పుతో పిండి వంటలే కాదు - కమ్మని "చట్నీ" కూడా చేసుకోవచ్చు! - టేస్ట్ చాలా బాగుంటుంది