కొత్తిమీరతో నోరూరించే "బజ్జీలు" - నూనె పీల్చకుండా, యమా టేస్టీగా!
- కొత్తిమీర గార్నిష్ కోసమే కాదు, ఇలా సూపర్ బజ్జీలు ప్రిపేర్ చేసుకోండి!

Published : August 6, 2025 at 7:05 PM IST
Kothimeera Bajji Recipe: బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. కూల్ వెదర్లో హాట్ హాట్ బజ్జీలను తింటే వచ్చే కిక్కే వేరు. అయితే సాధారణంగా బజ్జీలు అంటే చాలా మందికి మిరపకాయలు, ఆలుగడ్డ వాటితో చేసినవి మాత్రమే తెలుసు. కానీ కూరల్లో గార్నిష్ కోసం ఉపయోగించే కొత్తిమీరతో కూడా రుచికరమైన, కరకరలాడే బజ్జీలు చేసుకోవచ్చు. వీటి టేస్ట్ సూపర్‌గా ఉంటాయి. పైగా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వీటిని చేసి పెట్టారంటే వద్దనకుండా తినేస్తారు. మరి లేట్ చేయకుండా కొత్తిమీర బజ్జీలు ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- శనగపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - అర కప్పు
- కొత్తిమీర - తగినంత
- పసుపు - పావు టీస్పూన్
- ఉప్పు - సరిపడా
- కారం- 1 టీస్పూన్
- వాము - అర టీస్పూన్
- వంట సోడా - పావు టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ -అర టీస్పూన్

తయారీ విధానం:
- ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి కాటన్ క్లాత్ మీద వేసి ఓ అరగంట సేపు ఆరనివ్వాలి.
- ఈలోపు మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి, బియ్యప్పిండి, వాము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంటసోడా, పసుపు వేసి ఓసారి కలపాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బజ్జీల పిండి మాదిరి కలుపుకోవాలి.

- వాటర్ సరిపోయాయి అనుకున్న తర్వాత పిండిని సుమారు 5 నిమిషాల పాటు ఆపకుండా బీట్ చేసుకోవాలి.
- ఫ్యాన్ గాలికి ఆరిన కొత్తిమీరను కొంచెం తీసుకుని విడివిడిగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటి కాడలను కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీరను పిండిలో ముంచి గిన్నె అంచుకు రాసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి.

- ఇలా కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన కొత్తిమీరను కూడా పిండిలో ముంచి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి.

- ఇలా ప్రిపేర్ చేసుకున్న బజ్జీలకు మధ్యలోకి కాస్త ఘాటు పెట్టి లైట్‌గా ఉప్పు, కారం చల్లుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర బజ్జీలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- శనగపిండిలో నీటిని ఒక్కసారే పోసుకోకుండా, కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఒకటే డైరెక్షన్లో ఎక్కువ సేపు కలపడం వల్ల బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి.
- బజ్జీలను నూనెలో వేసేటప్పుడు కచ్చితంగా గిన్నె లేదా గ్లాస్ అంచుకు రాసి వేయాలి. బజ్జీలు సరిగ్గా వేగడమే కాదు, టేస్టీగా కూడా ఉంటాయి.
- పిండిని ఓసారి కలుపుకున్న తర్వాత వేలు ముంచి చూస్తే ఎంత మందానా పట్టింది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు, లూజుగా అనిపిస్తే మరికొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు.

అరటి పండు - ఓట్స్‌తో అద్దిరిపోయే "కుకీస్"! - ఓవెన్ అవసరం లేకుండానే రెడీ
ఈ స్టఫ్ఫింగ్ రెడీ చేసుకుంటే చాలు - "పూర్ణాలు, బొబ్బట్లు" రెండూ కుక్ చేసుకోవచ్చు!

