కరకరలాడే పాతకాలం నాటి "కొబ్బరి గారెలు" - కూల్ వెదర్లో ఇలా చేసుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా!
- కప్పు కొబ్బరితో ఈజీగా చేసుకునే సూపర్ 'స్నాక్' - చట్నీ లేకుండానే టేస్టీగా తినేయొచ్చు!

Published : May 28, 2025 at 11:11 AM IST
Traditional Kobbari Garelu Making : వాతావరణంగా చల్లగా ఉన్నప్పుడు అందరికీ వేడివేడిగా, కమ్మగా ఏదైనా తినాలనిపిస్తుంది. పైగా సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంట్లో ఉండే పిల్లలు హాట్ హాట్‌గా తినడానికి ఏమైనా స్నాక్స్ అడుగుతుంటారు. అలాంటి టైమ్ ఎప్పుడూ చేసి పెట్టే బజ్జీలు, పకోడీ కాకుండా ఈసారి సరికొత్తగా ట్రై చేయండి. ఇలా పాతకాలపు "కొబ్బరి గారెలు" చేసి ఇవ్వండి. కమ్మగా, కారంగా ఉండి పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే వీటిని తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చల్లని వేళ వేడి వేడిగా ఈ గారెలు తింటుంటే వచ్చే కిక్కు వేరే లెవల్లో ఉంటుంది! పైగా వీటి తయారీ కోసం ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన పని లేదు. చాలా సింపుల్‌గా కేవలం 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
టిప్స్ :
- ఈ రెసిపీ కోసం మరీ లేత కొబ్బరి కాకుండా కాస్త ముదిరిన కొబ్బరిని తీసుకుంటే గారెలు మంచి రుచికరంగా వస్తాయి.
- ఇక్కడ పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని వేసుకోవాలి.
- నూనె కాగిన తర్వాత మాత్రమే గారెలను వేసి వేయించుకోవాలి. లేదంటే ఆయిల్‌ని ఎక్కువగా పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే, తక్కువ మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్‌లో వీటిని వేయించాలి.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు
- కరివేపాకు - ఒక రెమ్మ
- అల్లం - చిన్న ముక్క
- పచ్చిమిర్చి - ఐదారు
- ఉప్పు - రుచికి సరిపడా
- బియ్యప్పిండి - ఒక కప్పు
- సన్నని కొత్తిమీర తరుగు - గుప్పెడు
- నూనె - వేయించడానికి తగినంత
కప్పు ఉప్మారవ్వతో కరకరలాడే "బోండాలు" - కేవలం 10 నిమిషాల్లో రెడీ!
తయారీ విధానం :
- కరకరలాడే కమ్మని గారెల తయారీ కోసం ముందుగా ఒక కప్పు పరిమాణంలో ముదిరిన పచ్చికొబ్బరిని సన్నగా తురుముకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా రెడీ చేసుకున్న సన్నని పచ్చికొబ్బరి తురుము, కరివేపాకు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, అవసరమైతే ఒకట్రెండు స్పూన్లు వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు నీళ్లు పోసి మరిగించుకోవాలి. అవి మరగడం స్టార్ట్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్, పొడి బియ్యప్పిండిని వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- కొబ్బరి పేస్ట్, బియ్యప్పిండి కలిసేలా చక్కగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూతపెట్టి ఐదారు నిమిషాల పాటు పక్కనుంచాలి.
- ఆ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత మూత తీసి సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని అది పిండిలో చక్కగా కలిసేలా మరోసారి చేతితో వత్తుతూ బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత చేతులను వాష్ చేసుకొని కాస్త నూనె రాసుకోవాలి. ఆపై కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ గారెల్లా చేసుకోవాలి.
- అయితే, గారెలను మరీ మందంగా కాకుండా కాస్త పల్చగా ఉండేలా వత్తుకోవాలి. అలా ఉంటేనే క్రిస్పీగా వస్తాయని గుర్తుంచుకోవాలి.
- అలాగని మరీ పల్చగా చేసుకుంటే నూనెలో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, మీడియం సైజ్ థిక్‌నెస్‌తో వత్తుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గారెలను పాన్‌లో సరిపడా వేసుకోవాలి.
- వీటిని వేసిన తర్వాత వెంటనే కదపకుండా నిమిషం పాటు వేగిన తర్వాత నెమ్మదిగా రెండు వైపులా గరిటెతో తిరగేస్తూ వేయించుకోవాలి.
- అవి రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత టిష్యూ పేపర్ పరచిన ప్లేట్లోకి తీసుకొని కాసేపు ఉంచి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కరకరలాడే కమ్మని "కొబ్బరి గారెలు" రెడీ!
స్ట్రీట్ స్టైల్‌ని మించిన టేస్ట్‌తో "బఠాణీ చాట్" - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!
ఆలూతో అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ "స్నాక్" - క్రిస్పీగా, టేస్టీగా ఉంటూ ఎన్ని తిన్నా బోర్ కొట్టదు!

