రాగిపిండితో రుచికరమైన "కుకీస్" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
- ఓవెన్ లేకుండా హెల్దీ అండ్ టేస్టీ కుకీస్ - అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు!

Published : October 12, 2025 at 1:46 PM IST
Ragi Cookies Recipe in Telugu : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మిల్లెట్స్‌ను తమ డైలీ డైట్లో భాగం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎక్కువ మంది పోషకాలు ఖజానాగా భావించే రాగులతో బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ నుంచి స్నాక్స్ వరకు రకరకాల రెసిపీలు చేస్తున్నారు. పిల్లలకు కూడా మిల్లెట్స్‌తో చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్ చేసి పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమ్మలు. ఇప్పుడు మీ అందరి కోసం అలాంటి ఒక స్నాక్ రెసిపీనే తీసుకొచ్చాం.
అదే, రాగిపిండితో సూపర్ టేస్టీ "కుకీస్". పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వీటిని బయట కొనివ్వకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి ఇవ్వండి. ఓవెన్‌తో పని లేకుండానే ఈ కుకీస్‌ను రెడీ చేసుకోవచ్చు. వీటి తయారీకి తక్కువ పదార్థాలే అవసరమవుతాయి. మంచి రుచికరంగా ఉండే వీటిని పిల్లలే కాదు పెద్దలూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ రాగి కుకీస్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అవసరమైన పదార్థాలు :
- ముప్పావు కప్పు - రాగిపిండి
- పావు కప్పు - ఓట్స్ పౌడర్
- పావు కప్పు - శనగపిండి
- రెండు టేబుల్‌స్పూన్లు - మిల్క్ పౌడర్
- రెండు టేబుల్‌స్పూన్లు - కొకోవా పౌడర్
- ఒక స్పూన్ - బేకింగ్ సోడా
- పావు చెంచా - యాలకుల పొడి
- చిటికెడు - ఉప్పు
- పావు కప్పు - పాలు
- నెయ్యి - పావు కప్పు
- పావు కప్పు - బెల్లం పొడి
మొక్కజొన్నతో గారెలు రొటీన్ - ఇలా "బూరెలు" చేయండి! - తియ్య తియ్యగా అద్దిరిపోతాయి!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కోసం ముందుగా రాగిపిండి, శనగపిండిని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో జల్లించుకున్న రాగిపిండి, శనగపిండి, ఓట్స్ పౌడర్, మిల్క్ పౌడర్, కొకోవా పౌడర్, యాలకుల పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని ఒకసారి అవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

- తర్వాత ఆ మిశ్రమంలో బెల్లం పొడి, నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆపై అందులో పాలను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ మిశ్రమం మొత్తాన్ని మెత్తటి పిండి ముద్దలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమాన్ని మెత్తటి పిండి ముద్దలా కలిపిన తర్వాత దానిపై మూత ఉంచి అరగంటపాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి.
- రెసిపీలోకి అవసరమైన ఓట్స్ పౌడర్, మిల్క్ పౌడర్, కొకోవా పౌడర్ ఇవన్నీ బయట అన్ని సూపర్ మార్కెట్స్, ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.

- అరగంట తర్వాత ఆ మిక్సింగ్ బౌల్‌ను బయటకు తీసి పిండి మిశ్రమాన్ని నిమ్మకాయంత సైజ్‌లో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బిస్కెట్లలా రెడీ చేసుకోవాలి.
- అలా పిండి మొత్తాన్ని కుకీస్‌లా ప్రిపేర్ చేసుకున్నాక వాటిని బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ మీద వరుసగా పేర్చాలి.
- అనంతరం ఓవెన్‌ను 325 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ప్రీహీట్ చేసి తర్వాత అందులో బిస్కెట్స్ ఉన్న బేకింగ్ ట్రేను నెమ్మదిగా పెట్టి సుమారు పావుగంట పాటు బేక్ అవ్వనివ్వాలి.
- ఒకవేళ మీ వద్ద ఓవెన్ లేనట్లయితే స్టవ్ మీద ఇలా బేక్ చేసుకోవచ్చు.
బేకరీ స్టైల్ "చందమామ బిస్కెట్లు" టేస్టీగా - మూడే మూడు పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

- ఇందుకోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నె ఉంచి అందులో ఒక చిన్న స్టాండ్ ఉంచాలి.
- ఆపై గిన్నె మీద మూత ఉంచి హై ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి.
- అనంతరం మూత తీసి స్టాండ్‌పై బటర్ పేపర్ వేసి కుకీస్ పెట్టుకున్న ప్లేట్ ఉంచి మూత పెట్టి సిమ్‌లో 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.

- మీరు ఓవెన్ లేదా స్టవ్ ఎలా బేక్ చేసుకున్నా అవి మంచిగా కాలిన తర్వాత బయటకు తీసి చల్లారనివ్వాలి.
- అవి పూర్తిగా చల్లారాక ఏదైనా గాలి చొరబడని సీసాలో స్టోర్ చేసుకోండి. అంతే, రాగిపిండితో పిల్లలు ఇష్టంగా తినే కుకీస్ లేదా బిస్కెట్లు ఇంట్లోనే ఈజీగా రెడీ అవుతాయి!

