నోటికి కమ్మని రుచినిచ్చే "కరివేపాకు పచ్చడి" - అన్నం, టిఫెన్స్లోకి అద్దిరిపోతుంది!
- ఈ పద్దతిలో 'కరివేపాకు చట్నీ' చేయండి - పిల్లలు కూడా ఇష్టంగా తింటారు!

Published : September 15, 2025 at 7:02 PM IST
Tasty Karivepaku Pachadi Recipe : "కరివేపాకు" మహిళల దృష్టిలో వంటల్లో వేసే పదార్థం మాత్రమే కాదు అదొక ఎమోషన్. వంటకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నా తాలింపులోకి కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు. వంటకాల్లో దానికి ఉన్న ప్రాధాన్యత అలాంటిది. నిజానికి కరివేపాకు వంటలకు వాసనతో పాటు మంచి రుచిని అందివ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలూ ఉంటాయి.
అంతటి ఆరోగ్యకరమైన కరివేపాకును చాలా మంది కూరలోనో, చారులోనో వస్తే తీసి పక్కన పెడుతుంటారు. పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీ ఇంట్లోనూ పిల్లలు, పెద్దవాళ్లూ కరివేపాకు తినట్లేదా? అలాంటి వారికి ఓసారి ఇలా "కరివేపాకు చట్నీ" చేసి పెట్టండి. అదంటే నచ్చనివాళ్లూ ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫెన్స్లోకి సూపర్ టేస్ట్‌నిస్తుంది. పైగా దీన్ని పావుగంటలో అప్పటికప్పుడు సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- రెండు కప్పులు - కరివేపాకు
- మూడు టేబుల్ స్పూన్లు - నూనె
- ఒక టేబుల్‌స్పూన్ - శనగపప్పు
- ఒక టేబుల్‌స్పూన్ - మినపప్పు
- అర టేబుల్‌స్పూన్ - ధనియాలు
- పావు టీస్పూన్ - మెంతులు
- పది - ఎండుమిర్చి(తగినన్ని)
- ఒక టీస్పూన్ - జీలకర్ర
- ఏడెనిమిది - వెల్లుల్లి రెబ్బలు
- చింతపండు - కొద్దిగా
- పోపుదినుసులు - ఒక టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - రెండు
- కరివేపాకు - కొద్దిగా(తాలింపులోకి)
కారప్పూసతో నోరూరించే "టమాటర్ సబ్జీ" - దాబా స్టైల్లో ఘుమఘుమలాడిపోద్ది!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా తాజా కరివేపాకును రెండు కప్పుల పరిమాణంలో కాడల నుంచి సెపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా పొడి క్లాత్‌తో తుడిచి కాసేపు ఆరబెట్టుకోవాలి.
- అలాగే, ఒక చిన్న గిన్నెలో కొద్దిగా చింతపండును తీసుకుని వేడినీళ్లలో నానబెట్టుకోవాలి.

- అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె లైట్‌గా వేడయ్యాక స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి కరివేపాకును బాగా వేయించుకోవాలి.
- కరివేపాకు మంచిగా వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
సూపర్ టేస్టీ "మొక్కజొన్న ఇడ్లీలు" - అప్పటికప్పుడు తక్కువ పదార్థాలతో రెడీ!

- తర్వాత అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక మినపప్పు, శనగపప్పు, ధనియాలు, మెంతులు, మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని ఎండుమిర్చిని వేసి దోరగా వేయించుకోవాలి.
- ఆ మిశ్రమం చక్కగా వేగిందనుకున్నాక దాన్ని మరో ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకుని వేయించి చల్లార్చుకున్న ఎండుమిర్చి మిశ్రమం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరోసారి మిక్సీ పట్టాలి.

- కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాక అందులోనే ముందుగా వేడి నీటిలో నానబెట్టిన చింతపండును వాటర్‌తో సహా వేసుకొని మరీ మెత్తగా కాకుండా రోట్లో రుబ్బుకున్నట్లుగా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపును రెడీ చేసుకోవాలి.
- అందుకోసం స్టవ్ మీద చిన్న పాన్ ఉంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసుకొని వేయించాలి
- తాలింపు మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ముందుగా రెడీ చేసుకున్న పచ్చిడిలో వేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "కరివేపాకు పచ్చడి" రెడీ అవుతుంది!
పల్లీలతో చట్నీలే కాదు - ఇలా కరకరలాడే "వడలు" చేసుకోండి! - టేస్ట్ సూపర్!

