అప్పటికప్పుడు చేసే కమ్మని "టమాటా పచ్చడి" - రుబ్బే పనిలేదు - అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్!
- అమోఘమైన రుచితో కమ్మని టమాటా పచ్చడి!

Published : May 9, 2025 at 8:32 AM IST
Instant Tomato Pachadi Recipe : చాలా మంది ఇష్టంగా తినే పచ్చళ్లలో టమాటా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే తృప్తిగా ఉంటుంది. అయితే చాలా వరకు వీటితో ఏ పచ్చడి చేసినా మిక్సీ పట్టడం లేదంటే రోట్లో రుబ్బడం చేయాల్సిందే. కానీ అలాంటిది ఏమీ లేకుండా కేవలం 10 నిమిషాల్లో టమాటా పచ్చడి చేసుకోవచ్చంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. మిక్సీలో వేసి గ్రైండ్ చేసే పని లేకుండా చాలా సింపిల్‌గా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్నడూ తినని టేస్ట్‌తో వహ్వా అనిపిస్తుంది. ఈ రెసిపీ బ్యాచిలర్స్‌కు మరింత స్పెషల్. అతి తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ చట్నీ అన్నంతో పాటు చపాతీ, టిఫెన్స్లోకీ అద్భుతంగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- టమాటాలు - 5
- పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - 15
- కారం - సరిపడా
- ఉప్పు - రుచికి సరిపడా
- చాట్ మసాలా - అర టీస్పూన్
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 3
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మకాయ - అర చెక్క
తాలింపు కోసం:
- నూనె - 2 టీస్పూన్లు
- జీలకర్ర - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:
- పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే టమటాలను శుభ్రంగా కడిగి వాటి తొడిమ తీసి ఒక్కో టమాటాను సగానికి కట్ చేసుకోవాలి. ఇలా టమాటాలన్నింటిని కట్ చేసుకుని పక్కన పెట్టాలి.
- అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి ఓ నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు ఉంచి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

- టమాటాలు ఓ వైపు ఉడికిన తర్వాత మరోవైపు తిప్పి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా రెండు వైపులా ఉడికిన తర్వాత వాటి పై తొక్కును తీసేసి గరిటె లేదా స్మాషర్ సాయంతో టమాటాలు, వెల్లుల్లిని మెత్తగా మెదుపుకోవాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా వేసి కలిపి ఓ నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ చాట్ మసాలా అనేది ఆప్షనల్. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక దాని ప్లేస్‌లో ధనియాల పొడి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది.
- అనంతరం ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. కాగిన నూనెలో జీలకర్ర వేసి చిటపటలాడించాలి. చివరగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించిన తర్వాత టమాటా మిశ్రమంలో కలుపుకోవాలి.
- ఆఖరున నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే టమాటా పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
- ఈ పచ్చడి అన్నం, చపాతీ, టిఫెన్స్లోకి పర్ఫెక్ట్. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.


