బొంబాయి రవ్వతో "ఊతప్పం" - ఇన్‌స్టంట్‌గా రెడీ చేసుకోవచ్చు - అద్దిరిపోయే రుచి!
-బొంబాయి రవ్వతో స్వీట్లు మాత్రమే కాదు, ఇలా ఊతప్పం చేసుకోండి! - సూపర్ టేస్టీ!

Published : August 9, 2025 at 7:33 PM IST
Instant Rava Uttapam: ఊతప్పం అంటే చాలా మందికి ఇష్టం. చూడగానే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది.ఎందుకంటే ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ వంటివన్నీ వేసి చేస్తాం కాబట్టి కలర్ఫుల్గా ఉండటంతో పాటు సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకే ఇంట్లో దోశ పిండి ఉందంటే చాలా మంది ఊతప్పం ప్రిపేర్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ దోశ పిండి, ఇడ్లీ పిండి కాకుండా ఓసారి బొంబాయి రవ్వతో చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా బొంబాయి రవ్వతో ఊతప్పం ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ - 2 కప్పులు
- గోధుమపిండి - 4 టీస్పూన్లు
- పెరుగు - 1 కప్పు
- నీళ్లు - 2 కప్పులు
- ఉప్పు - సరిపడా
- వంట సోడా - పావు టీస్పూన్
- ఉల్లిపాయ - 1
- క్యారెట్ - 1
- టమాటా - 1
- పచ్చిమిర్చి - 3
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి బొంబాయి రవ్వ, గోధుమపిండి, పెరుగు, నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇలా మిక్స్ చేసుకున్న పిండిపై మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకోవాలి.
- అందుకోసం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్‌పై పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి.

- ఇలా కట్ చేసుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన ఉంచాలి.
- ముందుగా కలుపుకున్న రవ్వ మిశ్రమాన్ని మిక్సీజార్‌లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో నీళ్లు అవసరమనిపిస్తే కొద్దిగా పోసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసి రవ్వ మిశ్రమాన్ని గిన్నెలోకి పోసుకుని రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా వేసి మిక్స్ చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి లైట్‌గా నూనె అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని గరిటెతో తీసుకుని ఊతప్పం మాదిరి పెనం మీద పోసుకోవాలి.
- ఆ తర్వాత ముందే తరిగిపెట్టుకున్న ఉల్లి మిశ్రమాన్ని వేసుకుని అంచుల వెంబడి లైట్‌గా నూనె వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి.
- ఊతప్పం ఓవైపు ఎర్రగా కాలిన తర్వాత మరో వైపుకు తిప్పుకుని ఓ నిమిషం కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
- మిగిలిన పిండి మొత్తాన్ని ఇలానే చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఊతప్పం రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- గోధుమపిండి అనేది కేవలం ఆప్షన్ మాత్రమే. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కావాలంటే గోధుమపిండి ప్లేస్‌లో బియ్యప్పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు.
- ఈ ఊతప్పానికి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే రవ్వ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి ఉప్పు కలుపుకునే సమయంలో అర చెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది.
- ఉప్మా రవ్వ ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో నీళ్లు, పెరుగు తీసుకోవాలి.
- ఉల్లిపాయలు, క్యారెట్ మాత్రమే కాకుండా మీకు నచ్చిన ఇతర కూరగాయలు కూడా వేసుకోవచ్చు.
- పిండి మరీ పల్చగా కాకుండా కాస్త గట్టిగానే ఉండాలి. పల్చగా అయితే ఊతప్పం సరిగ్గా రాదు.
ఘుమఘుమలాడే "వెజ్ కీమా పులావ్" - నాన్‌వెజ్ తిన్న ఫీలింగ్, ప్రిపరేషన్ ఈజీ!
వరలక్ష్మీ వ్రతం కొబ్బరి చిప్పలతో - అద్దిరిపోయే "పచ్చడి" చేసుకోండి!

