Instant Rava Kesari Recipe: స్వీట్స్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ నోట్లో వేసుకోగానే కరిగిపోయేవి అంటే లొట్టలేసుకుంటూ తింటారు. అలా కరిగిపోయే వాటిలో రవ్వ కేసరి ఒకటి. ఫంక్షన్లు, పూజలు, వ్రతాల సమయంలో చాలా మంది భోజనాల్లో ఈ స్వీట్‌ను వడ్డిస్తుంటారు. చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ రెసిపీని, పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అయితే అప్పటికప్పుడు ఈ రవ్వ కేసరి చేయాలంటే కాస్త కష్టమనే చెప్పుకోవచ్చు. ఇక ఆ టెన్షన్ లేకుండా కేవలం టీ పెట్టినంత సులువుగా రవ్వ కేసరి చేసుకోవచ్చు. అందుకు అవసరమయ్యే ప్రీమిక్స్ ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఒక్కసారి ఈ మిక్స్ తయారు చేసుకుంటే, ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లోనే స్వీట్ మీ చేతిలో ఉంటుంది. మరి, లేట్ చేయకుండా రవ్వ కేసరి ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ - 300 గ్రాములు
- పంచదార - 300 గ్రాములు
- నెయ్యి - 150 గ్రాములు
- డ్రైఫ్రూట్స్ - 75 గ్రాములు
- పాల పొడి - 75 గ్రాములు
- యాలకుల పొడి - 2 టీ స్పూన్లు

తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్ వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- డ్రై ఫ్రూట్స్ పలుకులు వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి కరిగించాలి.
- ఆ తర్వాత అందులోకి బొంబాయి రవ్వ వేసి లో-ఫ్లేమ్‌లో కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.

- రవ్వ వేగడానికి టైమ్ పడుతుంది కాబట్టి, నిదానంగా లో-ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి.
- రవ్వ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- రవ్వ మిశ్రమం చల్లారిన తర్వాత పంచదార, డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి, పాలపొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇలా కలుపుకున్న పొడిని ఎయిర్‌టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే రవ్వ కేసరి ప్రీమిక్స్ రెడీ.

- ఈ ప్రీమిక్స్‌ను యూజ్ చేసి రవ్వ కేసరి చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నీళ్లు పోసుకోవాలి. అయితే ఇక్కడ నీళ్లు అనేది మీరు ఎంత రవ్వ ప్రీమిక్స్ తీసుకుంటే దానికి డబుల్ పోసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకు, రెండు కప్పుల నీరు పోసుకోవాలి.
- ఆ నీటిలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి మరిగించుకోవాలి.
- ఈ లోపు మరో స్టవ్ మీద పాన్ పెట్టి టీ స్పూన్ నెయ్యి వేసి రవ్వ ప్రీమిక్స్‌ను జస్ట్ వేడి చేసుకోవాలి.
- ఈ రవ్వలో మరుగుతున్న నీటిని పోసుకుని కలుపుతూ దగ్గరగా ఉడికించుకుంటే రవ్వ కేసరి రెడీ.
టిప్స్:
- ప్రీమిక్స్ చేసేటప్పుడు నెయ్యిలో రవ్వ సరిగ్గా వేగకపోతే తొందరగా పాడవుతుంది. కాబట్టి కొంచెం ఓపికతో వేయించుకోవాలి.
- రవ్వ వేగి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పంచదార కలుపుకోవాలి. రవ్వ వేడిగా ఉంటే పంచదార వేసినప్పుడు అది కరిగిపోతుంది.
- పంచదార బదులు ఇదే మొత్తంలో బెల్లం పొడి వేసి కూడా చేసుకోవచ్చు.
- ప్రీమిక్స్ సాయంతో రవ్వ కేసరి చేసేటప్పుడు నీళ్లు మరిగించే సమయంలో కుంకుమపువ్వు లేకపోతే నచ్చిన ఫుడ్ కలర్‌ను వేసుకుంటే సరి.
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "రవ్వ స్వీట్" - వంట రాని వాళ్లూ ఈజీగా చేసుకోవచ్చు! - టేస్ట్ అద్భుతం!
శ్రీరామనవమి స్పెషల్ "రవ్వ పాయసం" - ఈ కొలతలతో చేస్తే వెన్నలా కరిగిపోతుంది!