Instant Pesarattu without Soaking: తెలుగువాళ్లకి ఇష్టమైన టిఫెన్స్లో పెసరట్టు ముందుంటుంది. వేడివేడి పెసర దోశలను నచ్చిన చట్నీతో తింటే దిల్ ఖుష్ అవ్వాల్సిందే. అయితే ఈ పెసరట్టు వేసుకోవాలంటే ముందురోజు రాత్రే పెసరపప్పు నానబెట్టి, మరుసటి రోజు ఉదయం గ్రైండ్ చేసి దోశలుగా పోసుకోవాలి. ఇదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా చాలా సింపుల్‌గా కేవలం నిమిషాల్లో పెసరట్టు వేసుకోవచ్చు. పెసర్లను నానబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా పెసరట్టు ఎలా పోసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- పెసర్లు - 1 కప్పు
- పచ్చిమిర్చి - 5
- వెల్లుల్లి రెబ్బలు - 12
- అల్లం ముక్కలు - కొన్ని
- జీలకర్ర - అర టీస్పూన్
- ఉప్పు - సరిపడా

తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి పెసర్లు తీసుకుని రెండు మూడు సార్లు వాటర్‌తో శుభ్రంగా కడగాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ వంపేసి పక్కన పెట్టాలి.
- మిక్సీజార్‌లోకి కడిగిన పెసలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి మొదట గ్రైండ్ చేయాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్ పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇలా రుబ్బుకున్న పిండిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ దోశలు పోసుకునేందుకు అనుగుణంగా కలుపుకోవాలి.
- పిండిని సరిపడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు పక్కన ఉంచాలి.

- ఈలోపు పెసరట్టు మీద గార్నిష్ చేసుకోవడానికి కావాల్సిన మిశ్రమం రెడీ చేసుకోవాలి. అందుకోసం అర కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి పిండిని ఓసారి కలిపి గరిటెతో కొద్దిగా తీసుకుని పెనం మీద పోసుకోవాలి. ఆ తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి.

- ఆ తర్వాత ముందే మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం దోశ మొత్తం మీద చల్లుకోవాలి. అనంతరం అంచుల వెంబడి లైట్‌గా నూనె అప్లై చేసి ఎర్రగా కాల్చుకోవాలి.
- పెసరట్టు కాలిన తర్వాత సగానికి మడిచి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో ఇలానే దోశలు పోసుకోవాలి.
- ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సరి. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- ఈ పెసరట్టు కోసం ఎండిన పెసర్లు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర అవి లేకపోతే పచ్చి పెసర్లు అయినా వాడుకోవచ్చు.
- ఎండు లేదా పచ్చి పెసర్లను నానబెట్టాల్సిన పనిలేదు. కేవలం శుభ్రంగా కడిగి నేరుగా మిక్సీ పడితే సరిపోతుంది.
- పచ్చిమిర్చిని మీరు తినే కారానికి సరిపడా వేసుకోవాలి. అలాగే పిండిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి.
- పెసరట్టును ఓ వైపు కాల్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు రెండు వైపులా కావాలంటే కాల్చుకోవచ్చు. అయితే ఉల్లిపాయలను మాత్రం రెండు వైపులా కాలిన తర్వాత మాత్రమే చల్లుకుని సగానికి మడుచుకుంటే సరిపోతుంది.