Instant Mango Tomato Chutney : మామిడికాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. అది నిల్వ పచ్చడైనా, అప్పటికప్పుడు తయారు చేసే రోటీ పచ్చడైనా సరే వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు. అయితే మామిడి రోటి పచ్చడిని ఎప్పుడూ ఒకేలా చేయకుండా ఈసారి కాస్తా వెరైటీగా టమాటాలు వేసి ఇన్స్టంట్ పచ్చడి చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మొదటిసారి చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. అన్నం, చపాతీ, టిఫెన్స్లోకి ఈ పచ్చడి సూపర్‌గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఇన్స్టంట్ మామిడికాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు:
- టమాటాలు - 3
- మామిడికాయ - 1
- ఆయిల్ - 2 టీస్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 6
- పచ్చిమిర్చి - కారానికి సరిపడా
- ఉప్పు - సరిపడా
- కారం- అర టీస్పూన్
- ధనియాల పొడి - అర టీస్పూన్
- జీలకర్ర పొడి - అర టీస్పూన్
- ఉల్లిపాయ - 1
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- టమాటా, మామిడికాయను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత టమాటాలను రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయను సైతం రెండు వైపులా కొద్దిగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత టమాటాలు, మామిడి ముక్కలు పెట్టాలి. అందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో సుమారు 7 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత టమాటాలు, మామిడి ఓ వైపు ఉడికిన తర్వాత మరోవైపు తిప్పి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా రెండు వైపులా ఉడికిన తర్వాత టమాటాలపై తొక్కు తీసేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

- ఈలోపు ఉల్లిపాయ, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఓ బౌల్లోకి ఉడికించి పొట్టు తీసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే మామిడి గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి గరిటె లేదా స్మాషర్ సాయంతో మెదుపుకోవాలి. లేదంటే మిక్సీజార్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఇన్స్టంట్ మామిడికాయ టమాటా పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- ఈ పచ్చడి కోసం పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలు వాడాలి. పులుపు ఎక్కువ లేని కాయలు వాడితే పచ్చడి చప్పగా ఉంటుంది.
- టమాటాలు మరీ పచ్చిగా కాకుండా, కాస్త పండినవి తీసుకుంటే గుజ్జు ఎక్కువ వచ్చి పచ్చడి రుచి బాగుంటుంది.
- పచ్చిమిర్చిని టమాటా, మామిడి పులుపుకు అనుగుణంగా తీసుకోవాలి. అప్పుడు పచ్చడి రుచి కరెక్ట్‌గా ఉంటుంది.
ఒక్క పిండితోనే ఇడ్లీ, దోశ, పొంగనాలు! - పావు గంటలోనే రెడీ - ఏ చట్నీతో తిన్నా అదుర్స్!
నీచు వాసన లేకుండా "చికెన్ ఫ్రై" - ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు! - అన్నింటిలోకి అదుర్స్!