Instant Green Chutney Recipe: "గ్రీన్ చట్నీ" ఈ పేరు తెలియని వారు ఉండరేమో. రెస్టారెంట్‌కు వెళ్లి స్టార్టర్స్ ఆర్డర్ చేసినప్పుడు వాటికి కాంబినేషన్‌గా దీనిని ఇస్తుంటారు. ఈ చట్నీ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇడ్లీ, దోశలు, శాండ్‌విచ్, పావ్‌భాజీ, భేల్‌పూరీ, పకోడీ సహా ఇతర స్నాక్స్‌లోకి ఈ గ్రీన్ చట్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే చాలా మందికి ఈ గ్రీన్ చట్నీ చేయడం రాదు. ఇది చేయడానికి ఎక్కువ పదార్థాలు కావాలని, ప్రాసెస్ పెద్దదని ఇంట్లో చేయడానికి అంత ఇంట్రస్ట్ చూపించరు. కానీ మీకు తెలుసా? ఈ గ్రీన్ చట్నీని ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. నమ్మలేకున్నారా? మీరు విన్నది నిజమే. కాస్త టైమ్ ఉన్నప్పుడు ఈ పద్ధతిలో గ్రీన్ చట్నీ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటే సరి. మరి లేట్ చేయకుండా ఇన్స్టంట్ గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- పుట్నాల పప్పు - 1 కప్పు
- కొత్తిమీర - గుప్పెడు
- పుదీనా - గుప్పెడు
- పచ్చి మిరపకాయలు - 6
- అల్లం ముక్క - అంగుళం
- వెల్లుల్లి రెబ్బలు - 4
- కరివేపాకు - 2 రెబ్బలు
- మిరియాలు - 1 టీస్పూన్
- ఆమ్‌చూర్ పౌడర్ - 1 టీస్పూన్
- చాట్ మసాలా- 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం:
- ముందుగా కొత్తిమీర, పుదీనా రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత నీరు లేకుండా పూర్తిగా వంపేసి ఓ కాటన్ క్లాత్ మీద పరిచి తేమ లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి.
- ఇవి పూర్తిగా ఆరిన తర్వాత కొత్తిమీరను కాడలతో సహా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులను చిన్నగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొత్తిమీర, పుదీనా తరుగు, కరివేపాకు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.

- ఇవి పొడిపొడిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి వేయించిన కొత్తిమీర మిశ్రమం, పుట్నాల పప్పు, మిరియాలు, జీలకర్ర, ఆమ్‌చూర్ పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి మధ్యమధ్యలో ఆపుకుంటూ పొడిపొడిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని జల్లించుకోవాలి. ఆ తర్వాత దీనిని తడి లేని, గాలి చొరబడని గాజు సీసాలో వేసి ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే సరి. గ్రీన్ చట్నీ ప్రీమిక్స్ రెడీ.

- గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఓ గిన్నెలోకి నాలుగు టేబుల్స్పూన్ల ప్రీమిక్స్ తీసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కప్పు వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- చివరగా కొన్ని చుక్కల నిమ్మరసం పోసి కలిపి సర్వ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- పుట్నాల పప్పు ప్లేస్‌లో శనగపప్పు అయినా తీసుకోవచ్చు. కాకపోతే దోరగా వేయించి చల్లారిన తర్వాత వాడాలి. అలాగే కొత్తిమీర, పుదీనా తాజాగా ఉంటే గ్రీన్ చట్నీ ఫ్రెష్‌గా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
- ఈ ప్రీమిక్స్ అస్సలు తడి లేని సీసాలో మాత్రమే స్టోర్ చేయాలి. అలాగే తీసేటప్పుడు కూడా చేతులు, గరిటెలు తడి లేకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తడి తగిలిన పాడయ్యే అవకాశం ఉంటుంది.

కమ్మని రుచితో "రొయ్యల కూర" - ఇలా చేస్తే నీచు వాసనే ఉండదు! - ఎవరైనా ఇష్టంగా తినేస్తారు!
కమ్మని "సేమియా ఫ్రూట్ కస్టర్డ్" - ఇలా చేస్తే పావు గంటలో రెడీ - బర్త్‌డే, పెళ్లిరోజుకి పర్ఫెక్ట్!