Instant Dosa Recipe: దోశలు అంటే చాలా మందికి ఇష్టం. వేడివేడి దోశలను పల్లీ చట్నీతో తింటుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే వీటిని ఇంట్లో చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. మినపప్పు, బియ్యం నానబెట్టి, రుబ్బుకోవాలి. ఆ తర్వాత వేసుకోవాలి. అందుకే చాలా మంది వీటిని ఇంట్లో చేయడం మానేస్తుంటారు. ఒకవేళ తినాలనిపిస్తే హోటల్‌కు వెళ్లడమో, ఇంటికే ఆర్డర్ పెట్టుకోవడం చేస్తుంటారు. అయితే ఇకపై దోశలు తినాలనిపిస్తే ఈ ప్రాసెస్ లేకుండా కేవలం నిమిషాల్లోనే మరమరాలతో సూపర్ టేస్టీ అండ్ స్పాంజీగా చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- మరమరాలు - 2 కప్పులు
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- పెరుగు - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్

తయారీ విధానం:
- ఓ బౌల్లోకి మరమరాలు తీసుకుని సరిపడా నీళ్లు పోసి సుమారు 15 నిమిషాలు నానబెట్టాలి.
- మరో గిన్నెలోకి బొంబాయి రవ్వ, పెరుగు వేసి కలపాలి. ఆ తర్వాత పావు కప్పు నీరు తీసుకుని మరోసారి కలిపి ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు నానబెట్టాలి.

- అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరమరాలు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో దాని సగం, బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇక్కడ రెండు కప్పుల మరమరాలకు ఒక కప్పు రవ్వ, అర కప్పు పెరుగు తీసుకున్నాం. అదే నాలుగు కప్పుల బొరుగులకు, 2 కప్పుల రవ్వ, కప్పు పెరుగు తీసుకోవాలి. ఇలా కొలతల ప్రకారం తీసుకుంటే దోశల రుచి బాగుంటుంది.
- నానిన మరమరాలను జల్లెడలో వేసి నీరు పోయేలా వడకట్టాలి. మిక్సీజార్‌లోకి నానిన మరమరాలు, రవ్వ మిశ్రమం, కొన్ని వాటర్ పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు.
- ఆ తర్వాత సరిపడా వాటర్ పోసి దోశలు పోసుకునేందుకు అనుగుణంగా కలుపుకోవాలి. దీంతో దోశ బ్యాటర్ రెడీ అవుతుంది.
- స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. పాన్ కాగిన తర్వాత గరిటెతో కొద్దిగా పిండి పోసి దోశ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఓ వైపు ఎర్రగా కాలే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత తీసి ఓ ప్లేట్లోకి వేసుకుంటే మరమరాల దోశ రెడీ.

- దీన్నే ఇంకో విధంగా వేసుకోవచ్చు. అందుకోసం టిష్యూ పేపర్‌కు లైట్‌గా ఆయిల్ అప్లై చేసి దోశ పెనం మీద రుద్దాలి. ఆ తర్వాత పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే సరి. కావాలనుకుంటే దాని మీద లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు.
- ఇలా పిండి మొత్తాన్ని దోశలుగా పోసుకోవాలి. ఆ తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని పల్లీ లేదా టమాటా ఇలా నచ్చిన చట్నీతో ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ మరమరాల దోశ రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.

మైదా, పప్పులు, సోడా లేకుండా "చిట్టి పునుగులు" - టేస్ట్ వేరే లెవల్ - నూనె అస్సలు పీల్చవు!