Instant Bread Uttapam: "ఊతప్పం" చూడగానే నోరూరించే బ్రేక్‌ఫాస్ట్. ఎందుకంటే ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి వంటివన్నీ వేస్తాం కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీంతో ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురుచూస్తుంటారు. పైగా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే చాలా మంది క్రమం తప్పకుండా ఊతప్పం తింటుంటారు. అయితే ఇది చేయాలంటే ముందురోజే పప్పు, బియ్యం నానబెట్టి, గ్రైండ్ చేసి పిండి రెడీ చేసుకోవాలి. ఇక పిండి ప్రిపేర్ చేసుకోవడం కుదరనప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా కూడా ట్రై చేయవచ్చు. అందుకోసం బ్రెడ్ ఉంటే సరిపోతుంది. మరి లేట్ చేయకుండా ఇన్‌స్టంట్ బ్రెడ్ ఊతప్పం ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు :
- బ్రెడ్ స్లైసులు - 8
- పెరుగు - అర కప్పు
- ఇడ్లీ రవ్వ - అర కప్పు
- బియ్యప్పిండి - 2 టీస్పూన్లు
- ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్)
- పచ్చిమిర్చి - 3
- టమాటా - 1
- క్యారెట్ - 1
- అల్లం ముక్క - చిన్నది
- ఉప్పు - సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :
- బ్రెడ్ ఊతప్పం తయారు చేయడానికి ముందుగా దానిపై గార్నిష్ చేసుకునే పదార్థాలను రెడీ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాను వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
- అలాగే క్యారెట్‌ను కడిగి పొట్టు తీసేసి సన్నగా తురుమి పక్కన పెట్టుకోవాలి. అల్లం ముక్కపై పొట్టు తీసేసి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే బ్రెడ్ స్లైస్‌లను చిన్న చిన్న ముక్కలుగా తుంచి పక్కన పెట్టాలి.

- మిక్సీజార్‌లోకి తుంచిన బ్రెడ్ స్లైస్‌లను వేసుకోవాలి. ఆపై అందులోకి ఇడ్లీ రవ్వ, పెరుగు, బియ్యప్పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత లైట్‌గా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ బ్రెడ్ మిశ్రమాన్ని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై అందులోకి ముందే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తరుగు, క్యారెట్ తురుము వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత లైట్‌గా వాటర్ పోసి కలుపుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. పెనం కాస్త వేడెక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఊతప్పం మాదిరిగా వేసుకోవాలి.
- ఆపై అంచుల వెంట లైట్‌గా నూనె అప్లై చేసుకుని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
- ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలా ఊతప్పాలు వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
- ఎంతో రుచికరంగా ఉండే "బ్రెడ్ ఊతప్పం" రెడీ. దీన్ని మీకు నచ్చిన చట్నీతో ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- తాజా బ్రెడ్ ముక్కలు తీసుకుంటే ఈ రెసిపీ టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు బ్రెడ్లోని గోధుమరంగు పార్ట్ నచ్చకపోతే దాన్ని తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు.
- పిండి మిశ్రమం మరీ గట్టిగా లేదా జారుగా ఉండకుండా ఊతప్పం వేసుకునేందుకు సరిపడేలా కలుపుకోవాలి. అప్పుడే ఊతప్పం చక్కగా, రుచికరంగా వస్తుంది.
- ఊతప్పం కాల్చుకునేటప్పుడు కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.
- పిండిని దోశ పెనంపైన పోసిన తర్వాత కావాలనుకుంటే పైన ఉల్లిపాయ తరుగును లైట్‌గా చల్లి కాల్చుకోవచ్చు.

కమ్మని "గోధుమపిండి లడ్డూలు" - ఇలా చేస్తే పాకం పట్టాల్సిన పనిలేదు - పిల్లలకు మస్త్ బలం!
ఎప్పుడూ ఉల్లి పకోడీ బోర్ - కొత్తగా "పాలక్ కార్న్ భజియా" చేయండి! - పిల్లలు భలే ఇష్టంగా తింటారు!