మిగిలిపోయిన అన్నంతో దూదిలాంటి "ఇడ్లీలు" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - టేస్ట్ కూడా అదుర్స్!
-రాత్రి మిగిలిన అన్నాన్ని తినలేకున్నారా? -ఇలా ఇడ్లీలు చేసుకోండి, మెత్తగా వస్తాయి!

Published : June 29, 2025 at 5:01 PM IST
Idli with Left Over Rice: అన్నం మిగిలిపోవడం ప్రతీ ఇంట్లో జరిగేదే. ఇక మిగిలిన అన్నాన్ని కొద్దిమంది నేరుగా తింటే, మరికొద్దిమంది తాలింపు వేసుకోవడం, ఫ్రైడ్ రైస్ చేసుకుని తినడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఎప్పుడో ఒకసారి చేసేవే. కాబట్టి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి అన్నం మిగిలిపోతే ఇడ్లీలు చేసుకోండి. సూపర్ సాఫ్ట్‌గా ఉండటమే కాకుండా, చాలా టేస్టీగా ఉంటాయి. కేవలం పావు గంటలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా దీనికోసం ముందే పిండిని ప్రిపేర్ చేసుకోవడం అవసరం లేదు. మరి లేట్ చేయకుండా మిగిలిన అన్నంతో మెత్తని ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- ఉడికించిన అన్నం - 1 కప్పు
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- పెరుగు - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- బేకింగ్ సోడా - పావు టీస్పూన్

తయారీ విధానం:
- మిక్సీజార్‌లోకి అన్నం వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై అందులోకి బొంబాయి రవ్వ, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఓసారి కలపాలి.

- అనంతరం కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఇడ్లీ పిండికి సరిపడేలా మిక్స్ చేసుకోవాలి. గిన్నెపై మూత పెట్టి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
- ఆ తర్వాత మూత తీసి మరోసారి కలుపుకోవాలి. చివరగా బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకుని పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టాలి. అందులో కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకోవాలి.

- ఈలోపు ఇడ్లీ ప్లేట్స్‌కు లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని కొద్దికొద్దిగా ప్లేట్స్‌లోకి వేసుకోవాలి.
- ఈ ప్లేట్స్‌ను ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ 5 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో సాఫ్ట్‌గా ఉండే ఇడ్లీలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- అన్నం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బొంబాయి రవ్వ, దాని సగానికి పెరుగు తీసుకోవాలి.
- పుల్లటి పెరుగు అయితే ఇడ్లీలు మరింత రుచికరంగా వస్తాయి.
- అన్నాన్ని గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు ఎక్కువ పోయకూడదు. పిండి మరీ పల్చగా అయితే ఇడ్లీలు సరిగ్గా రావు. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకోవాలి.

- పిండి గట్టిగా అనిపిస్తే కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి.
- బొంబాయి రవ్వను కలుపుకునే ముందు లైట్‌గా వేయించుకుంటే ఇడ్లీలు జిగురుగా మారకుండా ఉంటాయి.

జొన్నపిండితో కమ్మని "ఊతప్పం" - పది నిమిషాల్లో తయార్ - ఆరోగ్యానికీ మంచిది!
పిల్లలు స్వీట్ అడిగితే - ఇలా మొక్కజొన్న రవ్వతో "పాయసం" చేసి పెట్టండి! - రుచి భలేగా ఉంటుంది!

