ఇదొక్కటి వేసి "టమటా కుర్మా" చేసుకోండి - వీకెండ్లో చికెన్, మటన్ కర్రీల కంటే అద్భుతంగా ఉంటుంది!
- మూడు టమాటాలతో అద్దిరిపోయే కర్రీ - అన్నం, చపాతీ, పులావ్‌లోకి సూపర్ కాంబో!

Published : May 30, 2025 at 5:02 PM IST
Tomato Kurma Making Process : మనందరి ఇళ్లల్లో వేరే కూరగాయలేమి లేకున్నా టమాటాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అలాగే, చాలా మంది త్వరగా అయిపోతుందని రెండు టమాటాలు, ఒక ఉల్లిగడ్డతో సింపుల్‌గా కర్రీ చేసుకుంటుంటారు. అయితే, వాటితో ఎప్పుడూ ఒకే రకమైన కూరలు కాకుండా ఓసారి ఈ స్టైల్లో "టమాటా కుర్మా" చేసుకోండి. ఈ ప్రత్యేకమైన 'మసాలా పేస్ట్' వేసి చేసుకునే ఈ కర్రీ రుచిలో సరికొత్త అనుభూతినిస్తుంది. వీకెండ్లో ఇలా ఈ కుర్మా కర్రీ చేసుకున్నారంటే దీని టేస్ట్ ముందు చికెన్, మటన్ కూరలు కూడా తక్కువైపోతాయి! అంత గొప్పగా ఉంటుంది రుచి! ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇది సూపర్ ఆప్షన్. వేడివేడి అన్నం, చపాతీ, పులావ్ ఇలా దేనిలోకైనా మంచి కాంబినేషన్‌గా నిలుస్తుంది. అలాగే, బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశల్లోకీ చాలా బాగుంటుంది. మరి, ఈ సూపర్ టేస్టీ టమాటా కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
మసాలా పేస్ట్ కోసం :
- తెల్ల నువ్వులు - రెండు టీస్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- మెంతులు - పావుటీస్పూన్
- ధనియాలు - ఒకటీస్పూన్
- దాల్చినచెక్క - చిన్న ముక్క
- లవంగాలు - మూడు
- యాలకులు - మూడు
- పచ్చిమిర్చి - రెండు
- పచ్చికొబ్బరి ముక్కలు - రెండు టీస్పూన్లు
- చింతపండు - కొద్దిగా

తయారీ విధానం :
- కమ్మని టమాటా కుర్మా తయారీ కోసం ముందుగా ఒక స్పెషల్ మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయిలో తెల్ల నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్‌లో వేయించాలి.
- అవి కాస్త వేగిన తర్వాత దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు వేసి సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన మసాలా మిశ్రమం, పచ్చిమిర్చి తుంపలు, సన్నని పచ్చికొబ్బరి ముక్కలు, చింతపండు వేసుకొని ముందు వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేయాలి.
- ఆ తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి.
కమ్మని ఎగ్ బుర్జీ లాంటి "సుక్కా జుంకా"! - ఈ మహారాష్ట్ర ఫేమస్ వంటకాన్ని తప్పక రుచి చూడాల్సిందే!

కర్రీ కోసం :
- నూనె - 2 నుంచి 3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- ఉల్లిపాయ - ఒకటి
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటీస్పూన్
- టమాటాలు - మూడు
- పసుపు - పావుటీస్పూన్
- కారం - రెండు టీస్పూన్లు(రుచికి తగినంత)
- ఉప్పు - రుచికి సరిపడా

- టమాటా కుర్మా తయారీ కోసం ముందుగా ఉల్లిపాయను సన్నగా, పొడుగ్గా తరుక్కోవాలి. అలాగే, టమాటాలను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగాక జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అవి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇదే టైమ్‌లో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి.
- ఆ మిశ్రమం చక్కగా వేగినందునుకున్నాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి హై ఫ్లేమ్‌లో రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.

- అనంతరం పసుపు, కారం, ఉప్పు వేసి అవి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. తర్వాత మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- మూడు నిమిషాల అనంతరం టమాటాలు మెత్తబడి ఆయిల్ కూడా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలపాలి.
- తర్వాత ఆ మిశ్రమంలో ఒక కప్పు వాటర్(గ్రేవీకి సరిపడా) వేసుకొని కలిపి మూతపెట్టి ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.
- చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీతో ఘుమఘుమలాడే "టమాటా కుర్మా" మీ ముందు ఉంటుంది!
టిప్స్ :

- ఇక్కడ మీరు నువ్వులు వద్దనుకుంటే వాటి ప్లేస్‌లో పల్లీలను తీసుకోవచ్చు. అలాగే, పచ్చికొబ్బరి లేకపోతే అందుకు బదులుగా ఎండుకొబ్బరిని అయినా వాడుకోవచ్చు.
- ఈ రెసిపీ టేస్ట్ మొత్తం ముందుగా ప్రిపేర్ చేసుకునే కుర్మా మసాలా పేస్ట్లోనే దాగి ఉంటుంది. కాబట్టి, దాన్ని పర్ఫెక్ట్గా చేసుకొని ఈ కర్రీ చేసుకున్నారంటే రుచి అద్దిరిపోతుంది.
రవ్వతో ఇలా "చిప్స్" చేసుకోండి - కరకరలాడుతూ నెల రోజులు నిల్వ! - పైగా నూనె పీల్చవు!

