How to Make Wedding Style Dosakaya Pachadi: దోసకాయ పచ్చడి.. పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఇక పెళ్లిళ్లలో చేసే పచ్చడికి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. అందుకే చాలా మంది అదే రుచితో ఇంట్లో చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు కానీ.. ఆ టేస్ట్ రాదు. దీంతో తమకు వచ్చిన, నచ్చిన రీతిలో తయారు చేస్తుంటారు. అయితే అలాంటి వారు ఓసారి మేము చెప్పే ఈ పద్ధతిలో ప్రిపేర్ చేస్తే.. అచ్చం పెళ్లిళ్లలో తయారు చేసినట్లే వస్తుంది. ఇక దీనిని వేడి వేడి అన్నంలోకి తింటే అమృతమే. కేవలం అన్నం మాత్రమే కాదు టిఫెన్స్లోకి కూడా సెట్ అవుతుంది. మరి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- పల్లీలు - 1 టేబుల్ స్పూన్
- నువ్వులు - అర టేబుల్ స్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- పచ్చిమిర్చి - 10
- టమాటలు - 2
- చింతపండు - నిమ్మకాయ సైజ్
- వెల్లుల్లి రెబ్బలు - 5
- దోసకాయ - 1(మీడియం సైజ్)
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ - 1
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తాలింపు కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 5
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఎండుమిర్చి - 2
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం:
- ముందుగా దోసకాయను శుభ్రంగా కడిగి పొట్టుతీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గింజలు వద్దు అనుకుంటే తీసుకోవచ్చు. లేదు గింజలు కావాలనుకుంటే వాటిని రుచి చూసి చేదు లేకపోతే తీసుకోండి. అలాగే టమాటలు, పచ్చిమిర్చిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగుతున్నప్పుడు నువ్వులు వేసి చిటపటలాడించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లోకి నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి కలిపి లో ఫ్లేమ్‌లో టమాటలు ఉడికే వరకు వేయించుకోవాలి.
- టమాట ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరో రెండు నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత మిక్సీజార్ తీసుకుని పల్లీలు, నువ్వులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉడికించిన పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలను సగం వరకు వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకుని అందులోకి మిగిలిన దోసకాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి.
- అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి.. నూనె పోసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయాలి. అనంతరం కరివేపాకు, ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును పచ్చడిలో వేసి కలిపితే ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ.
ఈ స్టైల్లో ఒక్కసారి "టమాటా పచ్చడి" చేసుకోండి - ఔర్ ఏక్ ప్లేట్ ఇడ్లీ/దోశ మమ్మీ అని అడగడం పక్కా!
నోటికి కమ్మగా, పుల్లగా ఉండే "చింతకాయ పచ్చడి" - ఈ కొలతలతో పెడితే ఏడాది పైనే నిల్వ!