Ragi Pindi Pakodi : మిర్చీ బజ్జీ, పకోడీ అనగానే ఎవరికైనా నోరూరుతుంది. కానీ, శనగ పిండి వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుందేమో అనే భయంతో వాటికి దూరంగా ఉంటుంటారు. అలాంటి వారికి ఈ రెసీపీ ఎంతో ఉపయోగపడుతుంది. రాగి పిండి (finger millet flour)తో చేసుకునే ఎంతో ఆరోగ్యకరమైన ఈ వంటకం ఇంట్లో వాళ్లకూ ఎంతో నచ్చుతుంది. శనగపిండి, ఉల్లిపాయలు కలిపి చేసే పకోడీ మాదిరిగానే రాగి పకోడీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని టిప్స్ పాటిస్తే రుచిగా వస్తుంది. మామూలు శనగపిండి పకోడీ మాదిరిగా ఇవి అస్సలు నూనె పీల్చకుండా మరింత కరకరలాడుతూ ఉంటాయి.
పులిహోర కలపడం రావట్లేదా? - "పులి ఉప్మా" చేయండిలా - సేమ్ టేస్ట్!

- ఉల్లిపాయల్లో ఉండే నీరు పకోడీ మిశ్రమానికి సరిపోతుంది. ఏమైనా పిండి ఎక్కువ అయితే కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది.
- పకోడీ పిండి ముద్దగా కాకుండా కాస్త పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. ముద్దగా ఉంటే పకోడీ ఎక్సట్రా క్రిస్పీగా రాదు.
- శనగ పిండి పకోడీ రంగు ఇట్టే తెలిసిపోతుంది. కానీ రాగిపిండి మాడిందో లేదో కూడా అర్థం కాదు. అందుకే పకోడీని మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే మంచిది.
కావాల్సిన పదార్థాలు
- రాగి పిండి - అర కప్పు
- వేపిన పల్లీలు - అర కప్పు
- ఎండుమిర్చి - 7
- రుచికిసరిపడా - ఉప్పు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ తరుగు - పావు కిలో
- నూనె - వేపుకోడానికి సరిపడా

తయారీ విధానం
- పల్లీలు, ఎండుమిర్చి మిక్సీలో వేసుకుని బరకగా పొడి చేసుకోవాలి.
- పిండి కలపడానికి ఒక బౌల్లో ఉల్లిపాయ చీలికలు, ఉప్పు వేసి ముందు ఉల్లిపాయల్ని పిండుతూ బాగా కలుపుకోవాలి.
- పిండిన ఉల్లిపాయల్లో రాగి పిండితో పాటు ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
- పిండి మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది. అంతేగానీ మొత్తం ముద్దగా కాకుండా తడిపొడిగా పిండి కలుపుకోవాలి.
- ఇపుడు పొయ్యిపై కడాయి పెట్టి నూనె పోసుకుని హై ఫ్లేమ్‌లో మంట పెట్టాలి. నూనె వేడెక్కిన తర్వాత కలుపుకున్న పిండిని కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి.
- ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద బుడగలు తగ్గేదాకా వేపుకుని తీసుకోవాలి.
- పూర్తిగా చల్లారాక పకోడీ మరింత గట్టి పడుతుంది.
- ఈ పకోడీ నూనె పీల్చకపోవడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
బర్డ్ ఫ్లూ భయంతో "చికెన్ కర్రీ" మిస్ అవుతున్నారా? " - ఇలా చేస్తే రుచి అచ్చం కోడికూరలానే ఉంటుంది!
పాలు, పంచదార లేకుండా స్వీట్ - ఇంట్లో ఉండే వాటితో ఇలా చేస్తే నోట్లో వెన్నలా కరిగిపోతుంది!