పది నిమిషాల్లోనే "వంకాయ పెరుగు తాలింపు"! - ఆహా ఏమి రుచీ అంటారు!!
- నోరూరించే సూపర్ రెసిపీ - ఎవ్వరైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు

Published : August 23, 2025 at 12:41 PM IST
Vankaya Perugu Talimpu : మజ్జిగ పులుసు అందరికీ తెలుసు. కానీ, మజ్జిగతో ప్రిపేర్ చేసే వంకాయ తాలింపు మీకు తెలుసా? ఈ రెసిపీ కేవలం పదంటే పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. త్వరగా భోజనం చేయాల్సినప్పుడు, హడావిడిగా బయటకు వెళ్లాల్సిన వచ్చినప్పుడు ఈ రెసిపీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మజ్జిగ పులుసును మించి ఉంటుంది. రైస్ లో చక్కగా సరిపోతుంది. మరి, ఈ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? తయారు చేసే విధానమేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
కప్పు పెరుగు
1 ఉల్లిగడ్డ
పొడవు వంకాయలు నాలుగైదు
పచ్చి మిర్చీలు మూడ్నాలుగు
రెండు రెమ్మల కరివేపాకు
అర స్పూన్ పసుపు
స్పూన్ ధనియాల పొడి
స్పూన్ తాలింపు గింజలు
అర స్పూన్ జీలకర్ర
రెండు ఎండు మిర్చీ
ఒక రెమ్మ కరివేపాకు
చిటికెడు పసుపు
చిటికెడు ఇంగువ
కొత్తిమీర
ఉప్పు
తయారీ విధానం :
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో కప్పు పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత అరకప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి
అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు వంకాయలను రౌండ్ షేప్లో చిన్నగా, తక్కువ మందంలో (రూపాయి బిళ్ల మాదిరిగా) కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. లేదంటే రంగు మారుతాయి.
ఇప్పుడు స్టౌపైన పాన్ పెట్టి, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి
నీళ్లు రాకుండా ముక్కలు వేసుకొని, వాటిని మూడ్నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి
ఈ ముక్కలు సగం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చి మిర్చీలను నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి
రెండు రెమ్మల కరివేపాకు, ఉప్పు, అర స్పూన్ పసుపు వేసుకొని మూడు నిమిషాలపాటు ఫ్రై చేసుకోవాలి
కరివేపాకు, పచ్చి మిర్చీ కూడా చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి
తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని వంకాయ ముక్కలను పూర్తిగా చల్లారనివ్వాలి
ముక్కలు చల్లారిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ నీళ్లలో వేసుకోవాలి
ఆల్రెడీ వంకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి.. ఇప్పుడు సరి చూసుకొని, అవసరమైతే ఉప్పు వేసుకోవాలి. ఓకే అనుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టి, అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి
వేడెక్కిన తర్వాత స్పూన్ తాలింపు గింజలు, అర స్పూన్ జీలకర్ర, రెండు రెండు మిర్చీ, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి
తాలింపు రెడీ అయిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని మిక్స్ చేసి, మజ్జిగ పులుసులో పోసుకొని కలుపుకోవాలి
చివరగా కాస్త కొత్తిమీర కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది
అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు తాలింపు సిద్ధమైపోతుంది. ఇది రైస్ లోకి సూపర్ గా ఉంటుంది.
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకుంటే ఈజీగా కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.
శివుడికి ఇష్టమైన శంఖు పుష్పాలతో "బ్లూరైస్"! - ఎంతో రుచికరంగా ఉంటుంది!!

