ETV Bharat / offbeat

ఎంతో టేస్టీగా "తోటకూర - పుట్నాలపొడి" - ఇలా ప్రిపేర్ చేస్తే అదుర్స్!

- మీరు ఎన్నడూ తినని రెసిపీ - పిల్లలు కూడా ఇష్టంగా లాగిస్తారు

Garden Curry Recipe
Garden Curry Recipe (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : August 22, 2025 at 11:05 AM IST

3 Min Read
Choose ETV Bharat

Garden Curry Recipe : ఎంతో రుచికరంగా, మరెంతో హెల్దీగా ఉండే ఆకు కూరల్లో తోటకూర ముందు వరసలోనే ఉంటుంది. దీన్ని చాలా మంది వెల్లుల్లి కారంతో ప్రిపేర్ చేస్తుంటారు. మరికొందరు రెగ్యులర్ ఆకు కూర మాదిరిగా కుక్ చేస్తుంటారు. కానీ, పుట్నాలు, పల్లీలు, నువ్వులు కలిసిన పొడితో ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా?

ఒక్కసారి ఈ పొడితో తయారు చేశారంటే, ఇంట్లో వాళ్లు వదలకుండా లాగిస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఆకు కూర అనగానే ముఖం చిట్లించే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఆకు కూరలు కంటికి మంచివని వైద్యులు చెబుతుంటారు. అందుకే తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. కానీ, చాలా ఇళ్లలో పిల్లలు వీటిని ముట్టుకోరు. అలాంటి వారికి ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా లాగిస్తారు. మరి, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • నాలుగు కట్టల తోటకూర
  • స్పూన్ పల్లీలు
  • స్పూన్ పుట్నాల పప్పు
  • అర స్పూన్ ధనియాలు
  • స్పూన్ తెల్ల నువ్వులు
  • అర స్పూన్ ఆవాలు
  • స్పూన్ మినపప్పు
  • స్పూన్ పచ్చి శనగపప్పు
  • రెండు ఎండు మిర్చీ
  • రెండు పచ్చి మిర్చీ
  • ఒక ఉల్లిగడ్డ
  • రెండు రెమ్మల కరివేపాకు
  • అర స్పూన్ పసుపు
  • నాలుగు వెల్లుల్లి రెబ్బలు
  • అర స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్

నిమిషాల్లో తయారయ్యే 'ఆమ్లెట్​ టమాటా కూర' - రుచికరంగా ఉండి పిల్లలకు నచ్చుతుంది!

తయారీ విధానం :

  • స్టౌ పైన పాన్ పెట్టి, టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి
  • పల్లీలు చక్కగా వేగిన తర్వాత అందులో అర స్పూన్ ధనియాలు వేసుకోవాలి
  • కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి రంగు మారి, చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి
  • తర్వాత స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి. వీటిని ప్రత్యేకంగా వేయించాల్సిన అవసరం లేదు. ఆ వేడితోనే ఫ్రై అయిపోతాయి
  • ఇలా వేయించుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  • ఇప్పుడు అదే పాన్ ను స్టౌ పైన పెట్టుకొని ఒకటన్నర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి
  • నూనె వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి
  • తర్వాత రెండు ఎండు మిర్చీలను తుంపి వేసుకోవాలి. ఇంకా రెండు పచ్చి మిర్చీలను కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను కూడా ముక్కలు చేసి వేయాలి. రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి
  • కాసేపు వేగిన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకొని, ఆ తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తోట కూరను వేసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ తోట కూరను కుక్ చేసుకోవాలి.
  • తోట కూర కుక్ అయ్యేలోపు ముందుగా ఫ్రై చేసిపెట్టుకున్న వాటిని పొడి చేసుకోవాలి
  • వాటన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే మెత్తటి పొడిలా చేసుకోవద్దు. కాస్త బరగకగానే ఉండాలి. ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి
  • ఈ లోగా తోట కూర ఉడికిపోతూ ఉంటుంది. కాస్త ఉప్పు వేసి, మరికాసేపు కుక్ చేసుకోవాలి.
  • నాలుగు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి అందులో వేసేయాలి. వెల్లుల్లితో తోటకూరకు ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది.
  • ఆ తర్వాత అర స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి. చివరగా ఉప్పు సరిచూసుకొని స్టౌ ఆఫ్ చేసి దించేసుకుంటే సరి. అద్దిరిపోయే "తోటకూర పుట్నాలపొడి" రెసిపీ సిద్ధమైపోతుంది.
  • ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.

నిమిషాల్లో చేసుకునే "ఉల్లిగడ్డ కారం" - ఉడుకుడుకు అన్నంలోకి కమ్మగా ఉంటుంది!