కొత్త పద్ధతిలో కమ్మని "టమాటా రసం" - చల్లని వేళ వేడి అన్నంలోకి జుర్రుతూ తింటారంతే!
- కూల్ వెదర్లో ఘాటుగా ఘుమాయించే "రసం" - ఇంటిల్లిపాదీ తృప్తిగా తింటారు!

Published : October 10, 2025 at 9:55 AM IST
Perfect Tomato Rasam Recipe : రోజూ చేసుకునే కూరలు తిని తినీ బోర్ కొట్టినప్పుడు ఎక్కువ మంది రసం రెసిపీలు ట్రై చేస్తుంటారు. అందులో 'టమాటా రసం' ముందు వరుసలో ఉంటుంది. చిన్నా, పెద్దా అందరూ దీన్ని ఇష్టంగా తింటుంటారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో తీరులో ఈ రసాన్ని రెడీ చేసుకుంటుంటారు. అలాకాకుండా ఓసారి ఈ పద్ధతిలో "టమాటా రసం" చేసుకుని చూడండి.
స్పైసీ స్పైసీగా, భలే రుచికరంగా కుదురుతుంది. వేడివేడి అన్నంలోకి ఈ రసం వేసుకుని తింటుంటే ఆ ఫీల్ వేరే లెవల్లో ఉంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే వాటి కంటే టేస్టీగా ఉండి ఇంటిల్లిపాదీ కడుపునిండా, తృప్తిగా తింటారు. పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే నాలుగు ముద్దలు ఎక్కువే లాగిస్తారు. మరి, కమ్మగా నోరూరించే ఈ టమాటా రసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- టమాటాలు - ఎనిమిది
- కొత్తిమీర కాడలు - 20
- పసుపు - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- పచ్చిమిర్చి - నాలుగు
- చింతపండు గుజ్జు - నాలుగు టేబుల్‌స్పూన్లు
మసాలా పొడి కోసం :
- జీలకర్ర - రెండు టీస్పూన్లు
- మిరియాలు - మూడు టేబుల్‌స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 25 నుంచి 30
- కరివేపాకు - రెండు రెమ్మలు
పచ్చికారంతో నోరూరించే "ఆలూ గ్రేవీ కర్రీ" - ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు!

తయారీ విధానం :
- ఈ రసం రెసిపీ తయారీ కోసం ముందుగా బాగా పండిన తాజా టమాటాలను తీసుకుని శుభ్రంగా కడగాలి.
- తర్వాత వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.
- ఆపై టమాటా ముక్కలను చేతితోనే మాష్ చేస్తూ పిప్పి వదిలి, సారం దిగేలా బాగా పిండాలి.
- టమాటా ముక్కలను రసం వదిలేలా బాగా పిండిన తర్వాత అందులోనే శుభ్రంగా కడిగిన కొత్తిమీర కాడలను వేసి మరోసారి ఆ మిశ్రమాన్ని చేతితో గట్టిగా పిండుతూ రసాన్ని తీయాలి.
- అలా పిండిన తర్వాత అందులో లీటర్ వాటర్ పోసి మిశ్రమం మొత్తాన్ని కలుపుతూ మరోసారి బాగా పిండి మిగిలిన పిప్పిని చేతికి అందినంత మేర బయటకు తీసేసుకోవాలి.
- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, టమాటా పిప్పిని మరీ పూర్తిగా తీసేసినా రసం అంత రుచికరంగా ఉండదు.
- కాబట్టి, చేతికి అందిన వరకు లైట్‌గా తీసేసుకుంటే సరిపోతుంది.
- అనంతరం పిప్పి తీసేసుకున్న రసాన్ని పక్కనుంచి అందులోకి కావాల్సిన ఒక మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి.
- ఇందుకోసం రోలు లేదా చిన్న మిక్సీ జార్లో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ మీద రసం చేసుకునే పాన్ లేదా గిన్నె పెట్టుకుని అందులో పిప్పి తీసి పక్కన పెట్టుకున్న టమాటా రసం పోసుకోవాలి.
- ఆపై అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం గల పచ్చిమిర్చి చీలికలు, చింతపండు రసం వేసుకుని ఒకసారి బాగా కలిపి మూతపెట్టి పచ్చిమిర్చి సాఫ్ట్‌గా మారేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో మరిగించాలి.
- పచ్చిమిర్చి ఉడికి సాఫ్ట్‌గా మారిన తర్వాత, ముందుగా రెడీ చేసుకున్న మిరియాలు-వెల్లుల్లి ముద్దను వేసి అంతా కలిసేలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రసంలోకి తాలింపును సిద్ధం చేసుకోవాలి.
పచ్చికారంతో కరకరలాడే "దోశలు" - ఒక్కసారి తింటే రుచికి ఫిదా అవ్వాల్సిందే!

తాలింపు కోసం :
- నూనె - మూడ్నాలుగు టేబుల్ స్పూన్లు
- ఆవాలు - రెండు టీస్పూన్లు
- మినప్పప్పు - రెండు టీస్పూన్లు
- ఇంగువ - కొద్దిగా
- కరివేపాకు - రెండు రెమ్మలు
- ఎండుమిర్చి - ఏడెనిమిది

- ఇందుకోసం మరో బర్నర్ మీద చిన్న కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసి చిటపటమనిపించాలి.
- తర్వాత మినపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపును మంచిగా వేయించాలి.
- పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ముందుగా రెడీ చేసుకున్న రసంలో వేసి మిక్స్ చేసుకుంటే చాలు.
- అంతే, ఘాటు ఘాటూగా ఘుమాయించే కమ్మని "టమాటా రసం" రెడీ అవుతుంది!

చిట్కాలు :
- ఈ రెసిపీ కోసం నాటు టమాటాలు అయితే రసం మంచి రుచికరంగా వస్తుంది.
- అదే, మీరు ఒకవేళ హైబ్రిడ్ టమాటాలు వాడితే చింతపండు పులుసు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలని గుర్తుంచుకోవాలి.
- అలాగే, టమాటాలను మిక్సీ పట్టకుండా చేతితో మెదిపి రసం తీసుకుంటేనే చారు టేస్ట్ చాలా బాగుంటుంది.
- టమాటా పులుపును బట్టి ఈ రసంలో చింతపండు పులుసు అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలి.
- మసాలా పొడి ప్రిపరేషన్లో వెల్లుల్లి నచ్చని వాళ్లు స్కిప్ చేసి రసం రెడీ చేసుకోవచ్చు.
ఇడ్లీ, దోశల్లోకి అద్దిరిపోయే "చట్నీ" - పల్లీలు లేకుండానే టిఫెన్ సెంటర్ టేస్ట్!

