Crunchy and Tasty Ragi Chekkalu Recipe : నేటి రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మిల్లెట్స్‌ను డైలీ డైట్లో భాగం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా రాగులతో చేసిన ఇడ్లీ, దోశ, జావ, అంబలి వంటివి చేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరగిస్తున్నారు. అయితే, ఆరోగ్యానికి మేలు చేసే రాగులతో అవి మాత్రమే కాకుండా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ కూడా ఉంది. అదే, కరకరలాడే "రాగి చెక్కలు". వీటినే 'రాగి వడలు, రాగి అప్పాలు, చెక్క గారెలు' ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇవి బియ్యప్పిండి చెక్కల కంటే కూడా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు, ఈ చెక్కలను అప్పటికప్పుడు కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని హాయిగా తినేయొచ్చు. పైగా నూనె కూడా తక్కువే పీల్చుకుంటాయి! మరి, లేట్ చేయకుండా అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- రాగి పిండి - ఒక కప్పు(125 గ్రాములు)
- బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు
- నూనె - ఒక టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - ఒకట్రెండు
- ఉల్లిపాయ - ఒకటి
- సన్నని కరివేపాకు తరుగు - కొద్దిగా
- ఉప్పు - రుచికి తగినంత
- కారం - అరటీస్పూన్
- పసుపు - పావుటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- వంటసోడా - పావుటీస్పూన్
- పల్లీలు - రెండు టేబుల్‌స్పూన్లు
- నూనె - వేయించడానికి తగినంత
శనగపిండి లేకుండా "మిర్చి బజ్జీలు" - ఇలా చేస్తే నూనె పీల్చకుండా కమ్మగా వస్తాయి!

తయారీ విధానం :
- ఈ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కోసం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వీలైనంత సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో కప్పు(250ఎంఎల్) వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి.
- నీళ్లు వేడయ్యే లోపు ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగానే జల్లించి పెట్టుకున్న రాగి పిండిని తీసుకొని ఆపై అందులో బియ్యప్పిండి, నూనె వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా చేతితో పిండిని రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి.

- ఆవిధంగా పిండిని కలిపాక ఆ మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వంటసోడా వేసుకొని ఆనియన్స్‌ని కాస్త ప్రెస్ చెసినట్లు చేస్తూ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద వేడి చేసుకున్న నీళ్లను తీసుకొని అవసరానికి సరిపడా(ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి ముప్పావు కప్పు వరకు పడుతాయి) కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ ముందు గరిటెతో మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత చేతితో వత్తుతూ చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండిని మిక్స్ చేసుకునే క్రమంలోనే అందులో వేయించి పొట్టు తీసి బద్దలుగా చేసిన పల్లీలను యాడ్ చేసుకొని చెక్కలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని మరోసారి చక్కగా కలుపుకొని పక్కనుంచాలి.

- ఇప్పడు బటర్ పేపర్ లేదా పాలిథిన్ కవర్ తీసుకొని దానిపై కాస్త నూనె అప్లై చేసుకోవాలి.
- ఆపై ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని చేతితో వత్తుతూ చెక్కల మాదిరిగా వీలైనంత పల్చగా చేసుకోవాలి.
- చుట్టూ రౌండ్ షేప్ వచ్చేలా పగిలిపోకుండా చక్కగా చేసుకున్నాక త్వరగా ఫ్రై అవ్వడానికి మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఏదైనా కవర్ లేదా క్లాత్‌పై ఉంచాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో వేయించడానికి తగినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె మీడియంగా వేడయ్యాక చిన్న పిండి ముద్దను వేసి చెక్ చేసుకోవాలి.
- నూనె సరిగా కాగిన తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెక్కలను పాన్‌లో సరిపడా వేసుకొని 30 సెకన్ల పాటు కదపకుండా వేయించాలి.
- ఆ తర్వాత గరిటెతో తిప్పుకుంటూ రెండు వైపులా చక్కగా వేగి, క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే కరకరలాడే కమ్మని "రాగి చెక్కలు" రెడీ!

ఈ చిట్కాలతో పర్ఫెక్ట్ టేస్ట్ :
- బియ్యప్పిండిని కొద్దిగా వేసుకొని చెక్కలు చేసుకోవడం ద్వారా ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి.
- ఈ స్నాక్ రెసిపీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆనియన్స్ వేయకుండా ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజులు తాజా నిల్వ ఉంటాయి.
- ఈ చెక్కలలో వేయించిన పల్లీలను వేసుకోవడం ద్వారా తినేటప్పుడు అవి పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి.
- రాగి వడలను సరిగా వేయించుకోకపోతే కాస్త మెత్తగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి, మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా మారేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి.
కరకరలాడే "మూంగ్‌దాల్ మంగోడే" - ఈవెనింగ్ స్నాక్‌కు సూపర్ ఆప్షన్! - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
కప్పు బొంబాయి రవ్వతో క్రంచీ "చిట్టి చేగోడీలు" - ఇలా చేస్తే గుల్లగా, క్రిస్పీగా! - పైగా నూనె పీల్చవు!