Sorakaya PachiKaram Recipe in Telugu : సాధారణంగా సొరకాయ కర్రీలో కారం వేసి వండితే అంత రుచిగా ఉండదు. సొరకాయ ముక్కలకు కారం, మసాలా పట్టకపోవడమే ఇందుకు కారణం! అందుకే చాలా మంది పచ్చిమిర్చి వేసి కూర వండుతారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా సొరకాయ పచ్చికారం ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ రెసిపీ రుచి అంతా ఇందులో వేసే ఒక పదార్థం వల్ల వస్తుంది. ఆ పదార్థం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే! మరి ఈజీగా సొరకాయ పచ్చికారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- సొరకాయ - 1
- పచ్చిమిర్చి - 10
- పొట్టు తీసిన వెల్లుల్లి - 5
- అల్లం ముక్క - 1
- ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు
- పచ్చిశనగపప్పు - టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - టేబుల్‌స్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- కరివేపాకు - 2
- పసుపు - అరటీస్పూన్
- రుచికి సరిపడా ఉప్పు
- పచ్చికొబ్బరి ముక్కలు - పావుకప్పు

రుచికరమైన "పెసరపప్పు, సేమియా కేసరి" - స్వీట్‌గా చేసుకోవచ్చు, ప్రసాదంలో పెట్టొచ్చు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా సొరకాయను శుభ్రంగా కడగండి. ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి, అల్లం ముక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టుకొని 2 టేబుల్‌స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక టేబుల్‌స్పూన్ చొప్పన పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అరటీస్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి.
- అనంతరం కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి లో ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు వేయించండి.
- ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేయండి. అలాగే అరటీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
- ఈ సొరకాయ పచ్చికారం కూర కోసం అదనంగా నీళ్లు పోయాల్సిన పని లేదు. గిన్నెపై మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది.
- సొరకాయ ఉడకకపోతే అరకప్పు వరకు నీళ్లు యాడ్ చేసి ఉడికించుకోండి.
- సొరకాయ ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నెలోకి పావుకప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఈ పచ్చికొబ్బరి మిశ్రమం గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
- సొరకాయ చక్కగా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి లో ఫ్లేమ్‌లో నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చికారం రెడీ!
- ఈ సొరకాయ పచ్చికారం వేడివేడి అన్నం, చపాతీలతో రుచి చాలా బాగుంటుంది.
- సొరకాయ పచ్చికారం రెసిపీ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
"కమ్మటి దొండకాయ పచ్చికారం" - ఇలా చేస్తే ఎప్పటికీ వదలరు - అంత బాగుంటుంది!
"కొర్రమీను చేపల పచ్చడి" - ఈ మసాలతో పెడితే రుచి అద్దిరిపోతుంది!