Ragi Thopa Recipe in Telugu : సాధారణంగా రాగి పిండితో రాగి జావ, ఇడ్లీలు, దోసెలు ఎక్కువ చేస్తుంటారు. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుండడంతో రాగులను డైట్లో భాగం చేసుకుంటున్నారు ప్రజలు. అయితే, మీరు ఎప్పుడైనా రాగి పిండితో పాతకాలం నాటి రాగి తోప రెసిపీ ట్రై చేశారా? ఈ స్వీట్ నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. మరి ఈజీగా ఈ రాగి తోప ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- రాగి పిండి - 1 కప్పు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్
- పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
- బెల్లం తురుము - 1 కప్పు
- నెయ్యి - తగినంత

"రోజూ 15సిగరెట్లు, 6 పెగ్గులు ఎంత ప్రమాదమో వారికీ అంతే ప్రమాదం!" - హెచ్చరిస్తున్న పరిశోధనలు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కప్పు బెల్లం తరుము వేసుకోవాలి. ఇందులోకి రెండు కప్పుల నీరు యాడ్ చేసి బెల్లం కరిగించుకోవాలి. (ఇక్కడ ఏ కప్పుతో బెల్లం తురుము తీసుకుంటే అదే కప్పు కొలతతో వాటర్ తీసుకోవాలి.)
- బెల్లం పూర్తిగా కరిగిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లం నీళ్లలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోతాయి.
- అనంతరం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్‌స్పూన్లు నెయ్యి వేసి కరిగించుకోవాలి.
- నెయ్యి కరిగిన తర్వాత కప్పు రాగిపిండి వేసి లో ఫ్లేమ్‌లో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

- రాగి పిండి చక్కగా వేగిన తర్వాత అర కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం కరిగించిన బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
- అలాగే పిండిలో కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ మధ్యమధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- రాగి పిండి మిశ్రమం ఉడికి, నెయ్యి పైకి తేలి పాన్‌కు అంటుకోకుండా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి, టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే కమ్మటి రాగి తోప మీ ముందుంటుంది.
- ఈ రాగి తోప కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ హెల్దీ రాగి తోప తయారీ విధానం నచ్చితే మీరు ట్రై చేయండి.
మైదా లేకుండా "ఉల్లిపాయ పరోటాలు" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!