Pesarattu Recipe in Telugu : బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలలో దోసె మాదిరిగానే పెసరట్టు చాలా ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ఇంట్లో పెసరట్టుని ట్రై చేస్తుంటారు. అయితే, కొంతమంది ఎన్నిసార్లు పెసరట్టు తయారు చేసినా గట్టిగా వస్తుందని బాధపడుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇలా చేస్తే పెసరట్టు మెత్తగా చాలా రుచిగా వస్తుంది. మరి ఈజీగా పెసరట్టు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

పెసరట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు :
- పెసర్లు - 2 కప్పులు
- ఇడ్లీ పిండి - కప్పు
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - 2
- అల్లం - 2 చిన్న ముక్కలు
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- సన్నటి ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
పెసరట్టు తయారీ విధానం :
- ఇందుకోసం ముందు రోజు రాత్రి ఒక బౌల్లో పెసర్లు తీసుకొని శుభ్రంగా కడిగి, తగినన్ని నీరు పోసి నానబెట్టుకోవాలి.
- అంత టైమ్ లేకపోతే కనీసం 4 లేదా 5 గంటలు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నానబెట్టుకున్న పెసర్లు, జీలకర్ర, తగినన్ని నీరు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పెసరట్టు పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం నానబెట్టుకున్న పెసరట్టు పిండిలో కప్పు ఇడ్లీ పిండి వేసి కలుపుకోవాలి. ఇలా పెసరట్టు పిండిలో ఇడ్లీ పిండి కలుపుకోవడం వల్ల చాలా రుచిగా వస్తాయి.

- ఇప్పుడు స్టవ్‌పై దోసె పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి.
- పాన్ వేడయ్యాక మంటను లో ఫ్లేమ్‌కి తగ్గించి గరిటెడు పిండిని తీసుకొని పెసరట్టు మాదిరిగా ప్రిపేర్ వేసుకోవాలి.
- పెసరట్టు పైన సన్నటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు చల్లండి.
- తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని లైట్‌గా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
- ఇలానే మిగిలిన పిండితో పెసరట్టు తయారు చేసుకోవాలి.
- అంతే, ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ "పెసరట్టు" రెడీ!

ఈ పెసరట్టు అల్లం, కొబ్బరి చట్నీ తింటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ పిండితో తయారు చేసే ఈ పెసరట్టు తయారీ విధానం నచ్చితే మీరు ట్రై చేయండి.
కరకరలాడే "మిరియాల కారపూస" - ఈ టిప్స్ పాటిస్తే చాలు గుల్లగుల్లగా, రుచిగా వస్తాయి!
"కీర దోసకాయ రోటి పచ్చడి" - వేసవిలో ఈ చట్నీ ఎంతో చలువ చేస్తుంది!
ఆంధ్రా స్పెషల్ "గోదారోళ్ల పాల ముంజలు" - ఈ కొలతలతో చేస్తే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!