Pesarapappu Uttappam Recipe in Telugu : క్రిస్పీ దోసెల కంటే ఊతప్పం మరింత బాగుంటుంది. ఇవి రెండు తింటే చాలు చాలా మందికి మధ్యాహ్నం వరకు ఆకలిగా అనిపించదు. సాధారణంగా బియ్యం, మినప్పప్పు నానబెట్టి రుబ్బి ఊతప్పం ప్రిపేర్ చేస్తారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి. ఇక్కడ చెప్పిన విధంగా పెసరపప్పు ఊతప్పం చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఈజీగా పెసరపప్పు ఊతప్పం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- పెసరపప్పు - కప్పు
- పాలకూర - కట్ట
- అల్లం ముక్క - 1
- టీస్పూన్ జీలకర్ర
- క్యారెట్ తురుము - పావుకప్పు
- బొంబాయి రవ్వ - పావుకప్పు
- రుచికి సరిపడా ఉప్పు

స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు:
- పనీర్ తురుము - 50 గ్రాములు
- క్యారెట్ తురుము - పావుకప్పు
- ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు
- పచ్చిమిర్చి తరుగు - టేబుల్‌స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చిటికెడు ఇంగువ
- మిరియాల పొడి - పావు టీస్పూన్
- జీలకర్ర పొడి- పావు టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
"కీర దోసకాయ రోటి పచ్చడి" - వేసవిలో ఈ చట్నీ ఎంతో చలువ చేస్తుంది!

తయారీ విధానం :
- పెసరపప్పు ఊతప్పం రెడీ చేయడం కోసం ముందు రోజు రాత్రి పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో పెసరపప్పు తీసుకొని రెండుమూడు సార్లు శుభ్రంగా నీటిలో కడగండి. ఆపై ఇందులో సరిపడా నీళ్లు పోసి నైట్ మొత్తం నానబెట్టుకోండి.
- మరుసటి రోజు పాలకూర శుభ్రంగా కడిగి ఆకులు తెంపి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
- తర్వాత ఒక మిక్సీ గిన్నెలో నానబెట్టిన పెసరపప్పు నీళ్లు వడకట్టుకుని తీసుకోవాలి. ఇందులో కట్ చేసిన పాలకూర ఆకులు, అల్లం ముక్క, టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు, పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండిలో పావు కప్పు క్యారెట్ తురుము, పావు కప్పు బొంబాయి రవ్వ వేసి కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఊతప్పం చక్కగా రావడం కోసం పిండి మరీ గట్టిగా లేదా మరీ జారుగా ఉండకూడదు.
- ఈ లోపు స్టఫింగ్ రెడీ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు అన్నీ ఒక్కోటిగా వేసుకుని చక్కగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఊతప్పం చేయడం కోసం స్టవ్‌పై పెనం పెట్టండి. పెనం వేడెక్కాక గరిటెడు పిండితో ఊతప్పం వేయండి. ఈ ఊతప్పం కాస్త మందంగానే ఉండాలి.
- తర్వాత ఊతప్పంపై రెడీ చేసుకున్న పనీర్ స్టఫింగ్ పెట్టుకోవాలి.
- అలాగే ఊతప్పం పైన, అంచుల వెంబడి నూనె వేసి కాసేపు ఉడికించండి.
- తర్వాత ఊతప్పం మరోవైపు అరనిమిషం కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోండి.
- మిగిలిన పిండితోనూ ఇలాగే ఊతప్పం ట్రై చేయండి. ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు ఊతప్పం రెడీ!
ఈ పెసరపప్పు ఊతప్పం పల్లీ చట్నీ, టమోటా పచ్చడితో రుచి చాలా బాగుంటుంది. ఈ ఊతప్పం తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.
"ఇన్స్టెంట్ వెజ్ పొంగనాలు" - పిండి నానబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
కరకరలాడే "మిరియాల కారపూస" - ఈ టిప్స్ పాటిస్తే చాలు గుల్లగుల్లగా, రుచిగా వస్తాయి!