Pesara punugulu secret recipe : పెసర పునుగుల రుచి ఎంతో బాగుంటుంది. రోడ్ సైడ్ బండ్లపై వేసే బియ్యం పిండి పునుగుల కంటే ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. సాదా దోసె, పెసరట్టుకు ఎంత తేడా ఉంటుందో ఇవి కూడా రుచిలో అంత తేడా ఉంటాయి. ఏపీలో ఎక్కువగా పెసర పునుగులకు డిమాండ్ ఉంటుంది. అయితే, ఇవి అన్నిచోట్లా దొరకవు. కొన్ని ఫేమస్ ఫుడ్ సెంటర్లలో మాత్రమే లభిస్తాయి. ఏపీలో ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే పెసర పునుగులు అల్లం చట్నీతో ఇస్తుంటారు.
"ఇన్స్టెంట్ రవ్వ గుంత పొంగనాలు" - 15 నిమిషాల్లో చట్నీతో సహా రెడీ చేసుకోవచ్చు!
వేడి వేడి పెసర పునుగులు అల్లం చట్నీలో నంజుకు తింటుంటే ఆ మజానే వేరు. ఇప్పుడు మనం చేసే పునుగుల్లో ఓ సీక్రెట్ ఇంగ్రేడియంట్ ఒకటి ఉంది. ఆ సీక్రెట్ ఇంగ్రేడియంట్ ఏమిటో? ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- పెసరపప్పు - 1 గ్లాసు
- అల్లం ముక్కలు - కొద్దిగా
- పచ్చి మిర్చి - 3
- జిలకర - 1 స్పూన్
- ఉల్లిపాయ - 1 పెద్దది
- కొత్తిమీర - చిన్న కట్ట
- ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం
- పెసర పునుగుల తయారీ కోసం పెసర్లు లేదా పొట్టు పెసరపప్పును శుభ్రం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నీళ్లు పోసుకుని దాదాపు 4 గంటలు నానబెట్టుకోవాలి. అర్జంట్ గా చేసుకోవాలనుకుంటే 2 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది.
- చక్కగా నీళ్లలో నానిపోయిన తర్వాత నీళ్లన్నీ తీసేసి రుబ్బుకోవాలి. మిక్సీలో రుబ్బుకుంటే వంట సోడా వేసుకోవాల్సి ఉంటుంది. గ్రైండర్ లో రుబ్బుకుంటే సోడా వేసుకోవాల్సిన పని లేదు.
- గ్రైండర్ లో రుబ్బుకునే సమయంలో నీళ్లు పోయకుండా పిండి కాస్త బరకగా ఉండేలా చూసుకోవాలి. పిండి రుబ్బుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
- గ్రైండర్లో రుబ్బుకున్న పెసర పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి.
- ఇపుడు కడాయిలో పునుగులు కాల్చుకునేందుకు సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
- నూనె వేడెక్కేలోగా ముందుగా సిద్ధం చేసుకున్న సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చి మిర్చి, జిలకర, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి.
- ఇందులోనే సీక్రెట్ ఇంగ్రేడియంట్ ఆవనూనె వేసుకుంటే పునుగులు రుచికరంగా క్రిస్పీగా మంచి రంగులో వస్తాయి.
- ఆవనూనె అంటే ఆవాల నూనె కాదు. ఆవకాయ పచ్చడిలో పైన తేలే నూనె కొద్దిగా కలుపుకుంటే మంచి రంగు, రుచి వస్తుంది.
- ఇపుడు పెసర పిండి మిశ్రమాన్ని అంతా కలుపుకొని వేడి వేడి నూనె లో వేసుకుని కాల్చుకోవడమే.
- మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే పునుగులు లోపలిదాకా చక్కగా వేగుతాయి.
- మంట ఎక్కువగా పెట్టుకుంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి.
ఘుమఘుమలాడే "పెరుగు వంకాయ ఆవ కర్రీ" - వేడివేడిగా అన్నం, చపాతీల్లోకి కమ్మగా ఉంటుంది
రేషన్ బియ్యంతో "స్పాంజ్ కేక్" రెసిపీ! - చూడ్డానికే కాదు, రుచి కూడా అద్దిరిపోతుంది!