Palak Phulka in Telugu : ఆహారంతో ఆరోగ్యం కోరుకునే వారికి "పాలక్ పుల్కా" మంచి ఎంపిక అవుతుంది. ఈ పాలక్ పుల్కా పిల్లల లంచ్ బాక్స్ ల్లోకి, లేదా షుగర్ ఉన్నవారు, డైటింగ్ చేసే వారు తీసుకోవచ్చు. ఇవి గంటల తరబడి మెత్తగా ఉంటాయి. పప్పు, రైతాతో చాలా రుచిగా ఉంటాయి. సహజంగా ఎక్కువ మంది రాత్రిళ్లు చపాతీ తింటుంటారు. ఉదయం టిఫిన్లలోకి ఇలా పాలక్ పుల్కా ట్రై చేసి చూడండి
మహిళలు తప్పక తినాల్సిన "స్వీట్" ఇది! - రక్తహీనత, ఐరన్ లోపం ఉంటే ట్రై చేయండి
కావాల్సిన పదార్థాలు
- గోధుమ పిండి - 2 కప్పులు
- పాలకూర - 3 పెద్ద కట్టలు
- అల్లం - 1 ఇంచు
- పచ్చి మిర్చి -5
- వేయించిన జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
- చాట్ మసాలా - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నీళ్లు 200 ఎం.ఎల్.
ఈ టిప్స్ పాటించాలి
- ముందుగా పాలకూర కాడలను తీసేసి ఆకులను మాత్రమే ఉడికించుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- గోధుమ పిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే పుల్కా అంత సాఫ్ట్‌గా ఉంటుంది.
- రోటీలు మధ్యస్థంగా మందంగా ఉండాలి. అలాగని పలుచగా, ఎక్కువ మందంగా ఉండకూడదు.
- రోటీలు పెనం మీద రెండు వైపులా కాల్చుకున్న తర్వాత నేరుగా మంటపై కాల్చితే లోపలి వరకూ ఉడుకుతుంది.
తయారీ విధానం
- ముందుగా ఓ కడాయిలో నీళ్లు మరిగించుకుని పాలకూర ఆకుల తరుగు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
- ఇపుడు ఉడికించిన పాలకూర, అల్లం తరుగు, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఆ తర్వాత గోధుమ పిండిలో ఉప్పు, పాలకూర పేస్టు వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఆపై కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పగుళ్లు లేని ముద్దగా వత్తుకోవాలి.
- పిండి సాఫ్ట్ గా ఉండేలా తడి క్లాత్ కప్పి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- అర గంట తర్వాత మళ్లీ వత్తుకుని పుల్కాల కోసం చిన్న బాల్స్ చేసుకోవాలి.
- ఆపై పిండి చల్లుకుని రోటీలు వత్తుకుని పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
- రెండు వైపులా కాలిన తర్వాత గ్యాస్ మీద ఓ గ్రిల్ పెట్టి మీడియం ఫ్లేం మీద మంటపై కాల్చుకుంటే పొంగుతుంది.
- ఆ తరువాత రెండో వైపు వేసుకుంటే మళ్లీ పొంగుతుంది.
- రోటీలు వేడి మీద ఉన్నపుడే కాస్త నెయ్యి వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.
- వీటిని కాటన్ వస్త్రంతో కప్పి ఉంచితే గంటల తరబడి సాఫ్ట్ గా ఉంటాయి.
"పచ్చిమిర్చి కారప్పొడి" ఎప్పుడైనా ట్రై చేశారా? - నిల్వ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు!
హనుమాన్ జయంతి స్పెషల్ "వడలు" - సింపుల్‌గా ఇలా చేసేసి నైవేద్యం పెట్టేయండి!