చల్లచల్లగా తియ్యని "మస్క్ మిలాన్ జ్యూస్" - సగ్గుబియ్యం, సబ్జా గింజలతో అద్దిరిపోతుంది!
మీ పిల్లలకు మస్క్ మిలాన్ జ్యూస్ చేసివ్వండి - మిమ్మల్ని బాగా ఇష్టపడతారు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2025 at 4:05 PM IST
Muskmelon juice making process : వేసవి వేడెక్కిపోతోంది. ఇంట్లో ఉన్నా ఉక్కపోత భరించలేకుండా ఉంటోంది. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు కాస్త చల్లగా ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే శరీరాన్ని చల్లబరిచే మస్క్ మిలాన్ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. నోటికి రుచితో పాటు చల్ల చల్లగా ఉండే ఈ జ్యూస్ శరీరానికి ఎంతో బలాన్ని కూడా అందిస్తుంది.
కర్బూజ (మస్క్ మిలాన్) ముక్కలు ఎంతో తియ్యగా ఉంటాయి. చక్కెర అవసరం లేకుండానే వీటిని లాగించేయొచ్చు. అయితే, కొద్దిగా పాలు, సగ్గుబియ్యం, సబ్జా గింజలు కలుపుకొని తింటే ఆ మజానే వేరు.
ఘుమఘుమలాడే "ఇన్స్టెంట్ మజ్జిగ పొడి" - శరీరానికి ఎంతో చలువ చేస్తుంది
మస్క్ మిలాన్ సగ్గుబియ్యం జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దామా!
కావాల్సిన పదార్థాలు
- కర్బూజ కాయ - మీడియం సైజు
- సగ్గుబియ్యం - పావు కప్పు
- సబ్జా గింజలు - 1 టేబుల్ స్పూన్
- పాలు - అర లీటరు
- కస్టర్డ్ పౌడర్ - టేబుల్ స్పూన్
- చక్కెర - 4 టేబుల్ స్పూన్లు
- డ్రై ఫ్రూట్స్ - కొద్దిగా
- నీళ్లు - 2 కప్పులు
తయారు చేయడం ఇలా
- కర్బూజ కాయ తీసుకుని శుభ్రం చేసుకోవాలి. అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- గింజలను తీసేసి పల్ప్ను మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.
- మిక్సీ పట్టడానికి ముందు కొద్దిగా పల్ప్ పక్కన పెట్టుకోవాలి.
- మరో వైపు సబ్జాగింజలను గిన్నెలో నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి.
- కడాయిలోకి 2 కప్పుల నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి.
- వేడి నీళ్లలో సగ్గుబియ్యం పోసుకుని ఉడికించాలి.
- అవసరం అనుకుంటే మరికొన్ని నీళ్లు పోసుకోవాలి.
- ఈ సమయంలో సగ్గు బియ్యం మరుగుతున్న నీళ్లలోనే పాలు పోసుకుని మరిగించాలి.
- బాగా కలుపుకుని పాలు మరుగుతున్న సమయంలో ఓ గిన్నెలోకి కస్టర్డ్ పౌడర్ (వెనీలా, చాక్లెట్) తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు కట్టకుండా చిక్కగా కలుపుకోవాలి.
- ఈ వెనీలా పౌడర్ మీకు అందుబాటులో లేకపోతే కార్న్ ఫ్లోర్ లేదా పాల పొడిని కూడా కలుపుకోవచ్చు.
- కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని పాలు సగ్గుబియ్యంలో పోసుకుని బాగా కలుపుకోవాలి. గిన్నె మాడిపోకుండా చూస్తూ గరిటెతో కలుపుకోవాలి.
- ఈ సమయంలో మంట కాస్త తగ్గించుకుని చక్కెర పోసుకుని బాగా కలుపుకోవాలి.
- పాలు, కస్టర్డ్ పౌడర్ బాగా ఉడికి పాలు చిక్కగా మారిపోతాయి.
- ఇప్పుడు దాదాపు 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మస్క్ మిలాన్ జ్యూస్లో పాలు, సగ్గు బియ్యం మిశ్రమాన్ని కలుపుకోవాలి.
- అందులోనే నానబెట్టిన సబ్జా గింజలను కూడా వేసుకోవాలి.
- మిక్సీ పట్టడానికి ముందుగా పక్కన పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల మస్క్ మిలాన్ పల్పీని కూడా వేసుకుని కలుపుకోవాలి.
- చివరగా డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగి జ్యూస్లో కలుపుకుంటే సరిపోతుంది.
- ఇది చల్లగా కావాలనుకుంటే ఫ్రిజ్ లో రెండు మూడు గంటల పాటు ఉంచితే సరిపోతుంది.
- మధ్యాహ్న భోజనానికి ముందుగా రెడీ చేసుకుంటే భోజనం తర్వాత చల్ల చల్లగా ఆరగించేయొచ్చు.
మీ పిల్లలకు "రాయల్ ఫలుదా" చేసి ఇవ్వండి! - ఈ వేసవిలో చల్లగా ఉంచుతుంది!
10 నిమిషాల్లోనే అద్దిరిపోయే "పచ్చిపులుసు" - టైమ్ లేనప్పుడు సింపుల్గా చేసుకోండి!

