Meti Mutter Pulav : అప్పటికప్పుడు చేసుకునే టమోటా, పుదీనా, పాలకూర రైస్ ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంటాయి. ఇంట్లో ఎపుడైనా టిఫిన్లు లేనపుడు, కూరగాయలు లేనపుడు లంచ్ బాక్సుల్లోకి ఇలాంటి మేతి మటర్ పులావ్ చేసి పెడితే చాలు! ఒక్క మెతుకు కూడా మిగల్చరు. దీని తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు. తక్కువ టైంలో చేసుకునే మేతి మటర్ పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందామా!
15నిమిషాల్లో తెల్లని, దూదిలాంటి మృదువైన ఇడ్లీలు - ఈ స్టెప్స్ ఫాలో అయితే చట్నీ కూడా రెడీ!

కావల్సిన పదార్థాలు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- బిర్యానీ ఆకు -1
- లవంగాలు - 4
- యాలకులు - 2
- అల్లం - 1 టీ స్పూన్
- వెల్లుల్లి - 1 టీ స్పూన్
- జీలకర్ర 1 టీ స్పూన్
- పచ్చిమిర్చి - 3 చీలికలు
- మెంతి ఆకు - 100 గ్రాములు (6కట్టలు)
- పసుపు -పావు టీ స్పూన్
- బాస్మతి బియ్యం - 185 గ్రాములు
- పచ్చి బఠానీ గింజలు - ఒక కప్పు
- నీళ్లు - రెండు కప్పులు
తయారీ విధానం
- ముందుగా ఒక కడాయి తీసుకుని నూనె వేడి చేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇపుడు బాగా కడిగి శుభ్రం చేసుకున్న మెంతి ఆకు కాడలు లేకుండా వేసుకోవాలి.
- అందులో పసుపు కూడా వేసుకుని కలిపి ఆకులోని పసరు వాసన పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా మగ్గిన తర్వాత గంట పాటు నానబెట్టిన బియ్యం వేసుకుని గింజ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చెమ్మ ఆరి పొడి పొడిగా మారగానే ఒక కప్పు పచ్చి బఠానీ గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించడానికి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇదే సమయంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
- మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని 12 నిమిషాల పాటు ఉడికించాలి. కుక్కర్ లో అయితే నీళ్లు తగ్గించుకుని ఒక్క విజిల్ ఇస్తే చాలు. ఉడికించుకున్నాక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. మెంతి కూర బాగా వేగితేనే మంచి రుచిగా ఉంటుంది. మెంతి కూర సరిగ్గా ఫ్రై కాకపోతే చేదు వాసన ఉంటుంది.
"క్రిస్పీ సగ్గుబియ్యం వడలు" - ఈ పద్ధతిలో పొటాటో ఉడకబెట్టకుండా సింపుల్‌గా ట్రై చేయండి!
ఘుమఘుమలాడే "మటన్ గ్రేవీ కర్రీ" - ఇలా చేస్తే ముక్క జ్యూసీగా, త్వరగా ఉడికిపోతుంది!