వారెవ్వా అనిపించే "కొంకణి స్టైల్ మటన్ కర్రీ" - ఈ సండే ఎంజాయ్ చేయండి!
- మాంసం ప్రియులకు ఎంతగానో నచ్చే రెసిపీ - పిల్లలు కూడా ఇష్టంగా లాగిస్తారు

Published : August 22, 2025 at 5:05 PM IST
Konkani Mutton Curry : మటన్ కర్రీల్లో ఎన్నో వెరైటీ రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక్కో రెసిపీది ఒక్కో స్టైల్. దేని రుచి దానిదే. మటన్ ప్రియులు ఏ పద్ధతిలో వండినా ఇష్టంగా లాగిస్తారు. అయితే కొన్ని రెసిపీలు మాత్రం తిన్నాకొద్దీ తినాలనిపించేట్టుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో కొంకణి మటన్ కర్రీ ఒకటి. ఇందులో టమాటాలు కూడా వేస్తారు. ఇంకా ఇందులోకి కారం ముద్ద తయారు చేసుకునే విధానమే కొత్తగా ఉంటుంది. ఇవి కర్రీకి సరికొత్త రుచినీ తీసుకొస్తాయి.
పిల్లలు ఈ కర్రీని ఎంతో ఇష్టంగా లాగిస్తారు. పెద్దలు కూడా సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు. మరి, ఇంతకీ ఈ రెసిపీని తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలి? తయారు చేసే విధానం ఎలా ఉంటుంది? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
పావుకేజీ మటన్
అరకప్పు ఉల్లిపాయలు
ధనియాలు - 2 స్పూన్లు
జీలకర్ర 1 స్పూన్
సోంపు 1 స్పూన్
అల్లం చిన్న ముక్క
ఐదారు వెల్లుల్లి రెబ్బలు
అర స్పూన్ పసుపు
కారం స్పూన్
స్పూన్ పచ్చిమిర్చీ ముక్కలు
తగినంత ఉప్పు
కొత్తిమీర చిన్న కట్ట
కప్పు టమాటా ముక్కలు
రాయలసీమ స్టైల్ "ఎగ్ ఉగ్గాని" - కమ్మగా ఉంటుంది - పిల్లలకు ఇట్టే నచ్చుతుంది!
తయారీ విధానం :
ముందుగా స్టౌ వెలిగించి, పాన్ పెట్టుకొని అందులో ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి
కాసేపు తర్వాత జీలకర్ర, సోంపు వేసి మరికాసేపు చిట్లనివ్వాలి
ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి
పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులోనే కారం, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి చక్కటి పేస్టు మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి
ఇప్పుడు అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి.
వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి రంగు మారి, గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చి మిర్చీ ముక్కలు వేసుకోవాలి
ఆ తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్, తర్వాత మిక్సీ పట్టుకున్న కారం పేస్టును కూడా ఇందులో వేసి కలుపుకోవాలి
కాసేపు ఉడికించిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి.
మటన్ ముక్కలు ఈ మసాలా మిశ్రమంలో చక్కగా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత మూత తీసి, కొత్తిమీర వేసి కలుపుకొని స్టౌ ఆఫ్ చేసుకుంటే సరి. అద్దిరిపోయే కొంకణి స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది.
ఇది రెగ్యులర్ మటన్ కర్రీకన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిఫరెంట్ ఫ్లేవర్ కర్రీని పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.
టిప్స్ :
మటన్ ముక్కలను ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. దీనివల్ల కర్రీ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు
ఈ కర్రీలో నీళ్లు కూడా పెద్దగా వేయం కాబట్టి, నేరుగా మటన్ వేస్తే ముక్కలు ఉడకడం కష్టమవుతుంది. అందుకే ముందుగానే ఉడికిస్తాం
ఈ కర్రీ చపాతీల్లోకి, రోటీల్లోకి సూపర్ కాంబినేషన్‌గా ఉంటుంది. రైస్ లోకి కూడా అద్దిరిపోతుంది.
మఖానాతో "స్పాంజ్ దోశలు" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - చాలా టేస్టీ!

