Keera Dosakaya Pachadi in Telugu : వేసవి కాలంలో మనకు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా కీర దోసకాయలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా మంది డైలీ వీటిని సలాడ్ రూపంలో లేదా పచ్చిగా తీసుకుంటూ ఉంటారు. అయితే, వీటితో రుచికరమైన పచ్చడి చేయచ్చని మీకు తెలుసా? ఈ స్టోరీలో చెప్పిన విధంగా రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. కీరదోసకాయ పచ్చడి సమ్మర్లో చలువ చేస్తుంది. మరి ఈ రోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- కీర దోసకాయలు - 3
- ఎండుమిర్చి - 10
- ఒక టేబుల్‌స్పూన్ - ధనియాలు
- 2 టేబుల్‌స్పూన్లు - తెల్ల నువ్వులు
- టమోటాలు - 2
- అరటీస్పూన్ - జీలకర్ర
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజ్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ - ఒకటి
- ఆయిల్ -2 టేబుల్‌స్పూన్లు

తాలింపు కోసం
- ఆయిల్ -2 టేబుల్‌స్పూన్లు
- అర స్పూన్ - ఆవాలు
- అర స్పూన్ - జీలకర్ర
- అర స్పూన్ - మినప్పప్పు
- అర స్పూన్ - శనగపప్పు
- కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి - 5
- ఎండుమిర్చి - 4
- కరివేపాకు - కొద్దిగా
- చిటికెడు - ఇంగువ
పులిహోర కలపడం రావట్లేదా? - "పులి ఉప్మా" చేయండిలా - సేమ్ టేస్ట్!

కీరదోసకాయ రోటి పచ్చడి తయారీ విధానం
- ఇందుకోసం ముందుగా తాజా కీరదోసకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక టేబుల్‌స్పూన్ ధనియాలు, టీస్పూన్ జీలకర్ర, 2 టేబుల్‌స్పూన్లు తెల్ల నువ్వులు, ఎండుమిర్చి వేసి వేపండి.
- 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న దోసకాయ, టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుతూ వేయించండి.

- టమోటాలు కాస్త మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసి కలపండి.
- అడుగు మాడకుండా ఉండడానికి కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.
- కీర దోసకాయ ముక్కలు ఉడికేంత వరకు కలుపుతూ వేయించండి. కీరదోస చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు శుభ్రంగా కడిగిన రోటిలో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమం వేసి బాగా రుబ్బుకోవాలి.
- తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి బాగా రుబ్బుకోవాలి.
- ఆపై ముందుగా ఉడికించుకున్న కీరదోసకాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. (మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగానే ఒక్కొటీ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.)
- అంతేనండీ ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుంటే సరి!
- ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్‌స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై అర స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించండి. తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. తాలింపు దోరగా వేగిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కీరదోస రోటి పచ్చడి రెడీ.
- ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి పుల్లపుల్లగా, కారంగా ఎంతో రుచిగా ఉంటుంది.
- ఈ కీరదోస పచ్చడి నచ్చితే మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి.
"హెల్దీ పూరీలు" మైదా లేకుండా పెసరపప్పుతో ఇలా చేయండి! - టేస్ట్ అద్భుతంగా ఉంటాయి!
ఆంధ్రా స్పెషల్ "గోదారోళ్ల పాల ముంజలు" - ఈ కొలతలతో చేస్తే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!