Kakarakaya Ulli Karam Recipe : కాకరకాయ అనగానే మనలో ఎక్కువ మంది చేదు అంటూ ముఖం తిప్పేసుకుంటారు. ఇంట్లో కాకరకాయ కర్రీ, పులుసు చేశారంటే ఆ రోజు దాన్ని ముట్టకోకుండా ఉపవాసం చేసేవారు కొందరు ఉంటారు. అయితే, ఇక్కడ చెప్పిన విధంగా కాకరకాయ ఉల్లికారం చేస్తే కూర చేదు లేకుండా ఎంతో కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంతో కాకరకాయ ఉల్లికారం అద్దిరిపోతుంది.

కావాల్సిన పదార్థాలు:
- కాకరకాయలు - అరకిలో
- ఉల్లిపాయలు - 4
- శనగపప్పు - టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - టేబుల్‌స్పూన్
- ధనియాలు - టేబుల్‌స్పూన్
- జీలకర్ర - టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10
- ఉసిరి కాయంత చింతపండు
- కారం - రుచికి సరిపడా
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - సరిపడా
- పసుపు - అరటీస్పూన్

తయారీ విధానం:
- ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్‌లో రౌండ్‌గా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆపై కాకరకాయలోని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఓ కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. వేడివేడి నూనెలో ఉల్లిపాయలు వేసి కాస్త రంగు మారే వరకు వేపండి. ఆపై కాకరకాయ గుజ్జు, చింతపండు వేసి ఫ్రై చేయండి.
- తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి ఫ్రై చేయండి.
- ఈ మిశ్రమాన్ని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి ఎర్రగా వేపుకోండి. ఈ పప్పులను వేపి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి.
- ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఆపై ముందుగా రౌండ్‌గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలుపుతూ వేపుకోండి.
- కాకరకాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి.
- ఆపై వేపుకున్న కాకరకాయలలో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి.
- ఇలా అన్ని కాకరకాయల్లో ఉల్లికారం స్టఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ముందుగా కాకరకాయలు వేపుకున్న కడాయి పెట్టండి. ఇందులో నూనె ఉంటే అందులోనే స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి 5 నిమిషాల పాటు వేపుకోండి.
- అనంతరం కాకరకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిపోయిన ఉల్లికారాన్ని కూరలో వేసుకుని ఫ్రై చేసుకోండి.
- కాకరకాయ ఉల్లికారం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
- అంతే ఇలా చేసుకుంటే టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ!
ఈ కాకరకాయ ఉల్లికారం బయట ఉంటే 2 రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మరో 4 లేదా 5 రోజులు తినచ్చు. కాకరకాయ ఉల్లికారం తయారీ నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
సుబ్బయ్య హోటల్ స్పెషల్ "పెసర పునుగుల కుర్మా" - ఇలా చేస్తే అన్నంలోకి అమృతమే!
ఓట్స్, గోధుమ రవ్వతో "కమ్మటి ఇడ్లీలు" - అప్పటికప్పుడు ఈజీగా ఇలా చేసుకోండి!