Jonna Bun Dosa Recipe in Telugu : ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. సాధారణంగా జొన్నలతో కిచిడీ, చపాతీ, వంటివి ఎక్కువగా చేస్తుంటారు. కొందరు జొన్నలను రవ్వలాగా మర ఆడించి అంబలి చేసుకుని తాగుతారు. అయితే, ఇప్పుడు మనం జొన్నలతో రుచికరమైన బన్ దోసెల తయారీ విధానం చూద్దాం. ఈ బన్ దోసెలు మృదువుగా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఈ బన్ దోసెలు ఇష్టంగా తింటారు. జొన్న పిండి, జొన్నలతో చేసిన పదార్థాలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి (రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కావాల్సిన పదార్థాలు:
- జొన్నలు - కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- అరకప్పు పచ్చికొబ్బరి తురుము
- అరకప్పు అటుకులు

తయారీ విధానం:
- జొన్న బన్ దోసెలు చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పు జొన్నలు తీసుకొని రెండుమూడు సార్లు శుభ్రంగా కడగండి. ఆపై నీళ్లు పోసి 10 గంటలు నానబెట్టుకోవాలి. జొన్నలు ఎంత నానబెట్టుకుంటే ఈ బన్ దోసెలు అంత మృదువుగా వస్తాయి.
- జొన్నలు మిక్సీ పట్టుకునే ముందు అరకప్పు అటుకులు 10 నిమిషాలు నీటిలో నానబెట్టుకోండి.
- అనంతరం ఒక మిక్సీ గిన్నెలో నానబెట్టుకున్న జొన్నలు నీళ్లు వంపేసి తీసుకోండి. ఇందులోనే అరకప్పు పచ్చికొబ్బరి తురుము, అలాగే నానబెట్టుకున్న అటుకులు, కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మూత పెట్టండి. ఈ పిండిని 8 గంటల పాటు పులియబెట్టాలి.

- అనంతరం పిండిని మరోసారి బాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి.
- ఇప్పుడు బన్ దోసెలు చేయడం కోసం స్టవ్‌పై ఫ్రైయింగ్ పాన్ పెట్టండి. ఇందులో 2 టేబుల్‌స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి.
- ఆపై గరిటెడు పిండి వేసి కాస్త స్ప్రెడ్ చేసి పాన్ పై మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకోండి.
- బన్ దోసె మరోవైపు తిప్పి దోరగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి.
- మిగిలిన పిండితో సింపుల్‌గా ఇలా బన్ దోసెలు చేసుకుంటే సరి!
- ఈ జొన్న బన్ దోసెలు మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి. టమోటా చట్నీ, అల్లం పచ్చడితో తింటే రుచి అస్సలు మర్చిపోలేరు. జొన్న బన్ దోసె తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
మైదా లేకుండా "ఉల్లిపాయ పరోటాలు" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వెన్నలా కరిగిపోయే "బెల్లం సున్నుండలు" - ఇలా చేస్తే నోటికి కూడా అంటుకోవు!