PALLI CHUTNEY RECIPE IN TELUGU : హెటళ్లలో చట్నీ టేస్టీగా ఉంటుంది. కానీ, ఇళ్లలో చేసే చట్నీలోకి ఎన్ని పదార్థాలు వేసినా హోటల్ స్టైల్ టేస్ట్ మాత్రం రాదంటుంటారు చాలా మంది. వాస్తవానికి హోటళ్లలో చేసే చట్నీలో ఎక్కువ, తక్కువ పదార్థాలు ఏమీ వాడరు. కేవలం పల్లీలు, పచ్చిమిర్చి తప్ప. కాకపోతే పల్లీలు, పచ్చిమిర్చి నూనెలో వేయించకుండా నేరుగా మిక్సీ పట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల చట్నీ రుచి పెరుగుతుంది. పల్లీలు పొట్టు తీయకుండా వేయడంతో పాటుఅల్లం, వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకుని పోపు వేసి చూడండి. చట్నీ రుచి ఎంతో బాగుంటుంది.
కరకరలాడే "ఆకు పకోడి" - శనగపిండి లేకుండా ఇదొకటి కలిపితే చాలు! - క్రంచీగా వస్తాయి!

ఈ టిప్స్ పాటించండి :
- చట్నీలోకి చింత పండు వేయకండి, పచ్చిమిర్చి ఉడికించి తీసుకోండి.
- పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి నూనె వేయకుండా రెడీ చేసుకోండి.
- వేయించిన పల్లీలు పొట్టు తీయకుండానే గ్రైండ్ చేసుకోండి.

కావాల్సిన పదార్థాలు :
- పల్లీలు - 100 గ్రాములు
- పచ్చి మిర్చి - 6
- కరివేపాకు - 2 రెమ్మలు
- అల్లం - చిన్న ముక్క
- జీలకర్ర - అర స్పూన్

పోపు కోసం :
- నూనె - 1 టేబుల్ స్పూన్
- పచ్చి శనగపప్పు - 1 స్పూన్
- మినప్పప్పు - 1 స్పూన్
- ఆవాలు - 1 స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- ఎండు మిర్చి - 2
- కరివేపాకు - 1 రెమ్మ

తయారీ విధానం :
- పల్లీలను పెంకపై లేదా కడాయిలో సన్నటి మంటపై వేయించాలి. ఇవి ఏ మాత్రం మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా అన్ని వైపులా వేగిన పల్లీలను పొట్టు తీయకుండానే చట్నీలోకి వాడుకోవాలి. దోరగా వేయించిన పల్లీలను పక్కకు తీసుకుని అదే కడాయిలో కరివేపాకు రెమ్మలు కూడా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.

- ఇపుడు చట్నీలో కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. 100 గ్రాముల పల్లీలకు 6పచ్చి మిర్చి తీసుకుని వాటిని ఓ గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి.

- ఇలా నీళ్లలో మరిగించిన పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, కరివేపాకును మిక్సీలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
- గ్రైండ్ చేసుకున్న చట్నీ గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.

- ఇపుడు చట్నీలోకి పోపు పెట్టుకోవడానికి పొయ్యిపై చిన్న కడాయిలో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించి, ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి చిటపటలాడించి కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ కట్టేయాలి.
- ఇలా రెడీ చేసుకున్న పోపును గ్రైండ్ చేసిపెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకొంటే సరిపోతుంది.
పాలు విరగకుండా పరమాన్నం - ఈ టిప్‌తో చేస్తే పాయసం ఎన్ని గంటలైనా గట్టిపడదు!
కరకరలాడే "షిష్ ఫ్రై" -ఇలా చేస్తే పప్పుచారు, సాంబార్‌తో తినొచ్చు -కారంగా రుచి బాగుంటాయి!