Traditional Breakfast Recipe : మనందరం ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే దోశలు, ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి పప్పులతో కలిపి నానబెడుతుంటాం. లేదంటే జొన్న రొట్టె, సజ్జ రొట్టె, పిండి వంటకాలు వంటి వాటిల్లోకి యూజ్ చేస్తుంటాం. మరికొందరైతే వాటిని తినలేక బయట అమ్మేస్తుంటారు. కానీ, చాలా మందికి తెలియని విషయమేమిటంటే అదే రేషన్ బియ్యంతో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఒక అద్దిరిపోయే రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు చేసుకునే ఈ రెసిపీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అదే, పాతకాలం నాటి కమ్మని "వాము జావ". దీన్నే 'నూకల జావ' అని కూడా పిలుస్తుంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారంటే పెద్దలే కాదు పిల్లలూ చాలా ఇష్టంగా తింటారు! పైగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు. మరి, ఈ పాతకాలపు టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- బియ్యం రవ్వ - మూడు కప్పులు
- వాము - 2 నుంచి 3 టేబుల్‌స్పూన్లు
- చింతపండు - 100 గ్రాములు
- పెద్ద సైజ్ ఉల్లిపాయలు - రెండు
- పచ్చిమిర్చి - ఆరు
- పసుపు - కొద్దిగా
- కారం - తగినంత
- ఉప్పు - రుచికి సరిపడా

టిప్స్ :
- రైస్ రవ్వను రేషన్ బియ్యం లేదా కొత్త బియ్యంతో తయారుచేసుకుంటే జావ మంచి రుచికరంగా వస్తుంది. ఎందుకంటే వీటితో చేసిన రవ్వ కాస్త జిగురుగా ఉంటుంది
- మీకు రేషన్ బియ్యం అందుబాటులో ఉన్నట్లయితే కొన్ని బియ్యాన్ని తీసుకొని మిల్లులో రవ్వ మాదిరిగా పట్టించుకోవాలి.
- ఒకవేళ ఇంట్లో గ్రైండర్ ఉంటే అందులో తగినంత పరిమాణంలో రేషన్ బియ్యాన్ని నూక మాదిరిగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నా సరిపోతుంది.
- ఇక్కడ బియ్యం రవ్వ తీసుకున్న కప్పునే వాటర్, మిగతా ఇంగ్రీడియంట్స్ కొలవడానికి వాడుకోవాలి.
- ఒకవేళ మీ దగ్గర మట్టిపాత్రలు ఉన్నట్లయితే అందులో ఈ రెసిపీని చేసుకుంటే మరింత టేస్టీగా వస్తుంది.

తయారీ విధానం :
- పాతకాలం నాటి రుచికరమైన ఈ రెసిపీ కోసం ముందుగా రేషన్ బియ్యంతో కావాల్సిన పరిమాణంలో నూకను(రవ్వ) సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.
- అలాగే, రెసిపీలోకి కావాల్సిన ఒక్కో ఉల్లిపాయను నాలుగు పెద్దసైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు వాము జావ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలో బియ్యం రవ్వను తీసుకొని ఒకటికిరెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా, ఒక గిన్నెలో చింతపండుని తీసుకొని నీట్‌గా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద జావ తయారీకి అనువైన గిన్నె పెట్టుకొని 9 నుంచి 10 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి.
- ఎసరు మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ రవ్వను యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకునే క్రమంలో మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
- అది ఉడికేలోపు నానబెట్టుకున్న చింతపండు నుంచి తగినంత పరిమాణంలో గుజ్జుని తీసుకోవాలి. ఆపై అందులో పసుపు, కారం, వాము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి పక్కనుంచాలి.

- ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకుంటున్న నూకల రవ్వ చక్కగా ఉడికిందనుకున్నాక అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు వాము మిశ్రమాన్ని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపాలి.
- అలాగే, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిలను కూడా వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చితో పాటు చింతపండు మిశ్రమం కూడా చక్కగా మగ్గుతుంది. అలా మగ్గిందనుకున్నాక ఆ పాన్ని దింపి అందులోకి తాలింపుని రెడీ చేసుకోవాలి.
తాలింపు కోసం :
- నూనె - రెండుమూడు టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - కొద్దిగా
- జీలకర్ర - ఒక టీస్పూన్
- శనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్
- మినపప్పు - ఒక టేబుల్‌స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- ఎండుమిర్చి - నాలుగు
- ఇంగువ - చిటికెడు

- ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసుకొని అవన్నీ చక్కగా వేగేలా ఫ్రై చేసుకోవాలి.
- అవి వేగాక ఆఖర్లో ఇంగువ కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆపై తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న జావ మిశ్రమంలో వేసుకొని మొత్తం కలిసేలా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే అమ్మమ్మల నాటి "వాము జావ" రెడీ!
ఓట్స్‌తో అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆప్షన్!