Guntur Special Gutti Vankaya Karam in Telugu : చాలా మందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రరీ తయారీ విధానం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే, ఇప్పుడు మనం గుంటూర్ స్పెషల్ గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ఈ వంకాయ కారం వేడివేడి అన్నంతో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీకి ఇందులో వాడే పదార్థాలే మరింత రుచిని పెంచుతాయి. మరి ఈ వంకాయ గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :
- వంకాయలు -8
- ఎండు కొబ్బరి ముక్కలు - అరకప్పు
- మెంతులు - చిటికెడు
- వెల్లుల్లి - 15
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- బెల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు
- అర టీస్పూన్ జీలకర్ర
- అర టీస్పూన్ ఆవాలు
- చిటికెడు ఇంగువ
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- 2 రెమ్మలు కరివేపాకు
- ఉప్పు, కారం - రుచికి సరిపడా
"ఇన్స్టెంట్ వెజ్ పొంగనాలు" - పిండి నానబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
తయారీ విధానం:
- ఈ కూర కోసం ముందుగా తాజా వంకాయలు బాగా శుభ్రం చేసుకోవాలి. ఆపై వంకాయలను చాకుతో నాలుగు ముక్కలుగా మధ్యలోకి చీల్చుకొని పక్కన ఉంచుకోవాలి.

- ఆ తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టుకోండి. ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, టేబుల్ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
- ఎండుకొబ్బరి ముక్కలు కాస్త రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి.
- తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేయించిన ఎండుకొబ్బరి ముక్కల మిశ్రమం, 2 టేబుల్ స్పూన్లు బెల్లం తురుము, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ కొబ్బరి పొడిని చిన్న గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కల్లో కొబ్బరి పొడి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలను పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. ఆపై అర టీస్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
- తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి గిన్నెపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి.
- వంకాయలు పూర్తిగా మగ్గడానికి కాస్త టైమ్ పడుతుంది. నిదానంగా మధ్యమధ్యలో కలుపుతూ వంకాయలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
- వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత మిగిలిపోయిన కొబ్బరి కారం మిశ్రమం వేసి ఒక నిమిషంపాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే నోరూరించే గుంటూర్ స్పెషల్ గుత్తి వంకాయ కారం రెడీ!
వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ గుత్తి వంకాయ కారంతో తింటే రుచి అమృతంలా ఉంటుంది. ఈ గుత్తి వంకాయ కారం తయారీ విధానం నచ్చితే మీరు ట్రై చేయండి.
పెసరపప్పుతో "పాలక్ పనీర్ ఊతప్పం" - ఇది ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్!
కమ్మటి "పచ్చిమిర్చి కరివేపాకు తొక్కు" - వేడివేడి అన్నంలో తింటుంటే ఆ మజానే వేరు!