ఫంక్షన్లలో చేసే "దోసకాయ పచ్చడి" రుచి ఇదే! - ఈ పద్ధతిలో చేస్తే అన్నం మొత్తం తినేస్తారు!
"కమ్మటి దోసకాయ పచ్చడి" - పెళ్లిళ్లు, ఫంక్షన్లలలో ఇలానే చేస్తారు, మీరూ ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2025 at 9:51 AM IST
Fuctions Style Dosakaya Pachadi in Telugu : పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వడ్డించే దోసకాయ పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది. చాలా మంది ఈ చట్నీ అడిగి మరీ వడ్డించుకుని తృప్తిగా భోజనం చేస్తారు. అయితే, చాలా మందికి ఈ దోసకాయ పచ్చడి ఎలా చేస్తారో తెలియదు!అలాంటివారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా దోసకాయ చట్నీ ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ దోసకాయ చట్నీ వేడివేడి అన్నంతో అద్దిరిపోతుంది. మరి ఈజీగా ఫంక్షన్స్ స్టైల్ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
- దోసకాయ - 1
- పచ్చిమిర్చి - 12
- లేత పొడవు వంకాయలు - 4
- టమోటాలు- 4
- వెల్లుల్లి - 5
- చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు
- కరివేపాకు - 2
- ఉల్లిపాయ - 1
తాలింపు కోసం
- ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు
- పచ్చిశనగపప్పు - టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - టేబుల్‌స్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- కరివేపాకు - 2
- ఎండుమిర్చి - 4

క్రీం, మిల్క్ పౌడర్ లేకుండానే "మ్యాంగో ఐస్" - ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
తయారీ విధానం
- ముందుగా దోసకాయను చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అలాగే పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నీటిలో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
- ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి 2 టేబుల్‌స్పూన్లు ఆయిల్ వేసి హీట్ చేయండి.
- నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి.
- పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. ఆపై లేత పొడవు వంకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేయించండి.
- వంకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే కడాయిలోకి టమోటా ముక్కలు వేసి కాసేపు మగ్గించండి.
- టమోటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేయించిన పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో వెల్లుల్లి, నానబెట్టిన చింతపండు, కరివేపాకు, రుచికి సరిపాడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం ఇందులో వేయించుకున్న వంకాయ ముక్కలు, టమోటాలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
- ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఓసారి గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి బాగా కలపండి.
- ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం స్టవ్‌పై కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయండి.
- వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేయండి.
- ఆపై కరివేపాకు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించండి. చివరిగా తాలింపులో దోసకాయ పచ్చడి వేసి కలుపుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ దోసకాయ పచ్చడి మీ ముందుంటుంది.
- ఈ టేస్టీ దోసకాయ పచ్చడి తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
ఘుమఘుమలాడే "చందమామ చేపల పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే నీచు వాసన ఉండదు!
కమ్మని "మాగాయ పచ్చడి" - ఇలా పెట్టుకుంటే ఏడాదంతా తిన్నా బోర్ కొట్టదు!

