పాతకాలపు పద్ధతిలో "ఎండు రొయ్యల కూర" - ఆ రుచికి మైమరచిపోతారు!
- ఎండు రొయ్యల్లో ఎన్నో పోషకాలు - ఆకు కూరతో కలిపి వండితే ఆమోఘమే!

Published : April 3, 2025 at 8:01 PM IST
Royyalu Gongura Recipe : తెలంగాణ రుచుల్లో ఎండు రొయ్యలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వట్టి తునకల మాదిరిగా వీటిని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. చక్కగా పండిన టమాటాల్లో ఎండు రొయ్యలు వేసి కర్రీ చేస్తే ఆ రుచి ఎవరైనా మైమరచిపోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది.
ఇక్కడ మనం తెలుగువారి ప్రియమైన ఆకుకూర గోంగూరతో కలిపి ఎండు రొయ్యల కర్రీ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎండు రొయ్యల ప్రేమికులకు ఇది ఒక మరపురాని రుచిని అందిస్తుందనడంలో సందేహం లేదు. మరి, ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? ఏమేం పదార్థాలు కావాలి? అన్నది తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
- ఎండు రొయ్యలు - 1 కప్పు
- లేత గోంగూర - 3 కట్టలు
- ఉల్లిపాయలు - 2 (మీడియం సైజు)
- పచ్చిమిరపకాయలు - 8
- కరివేపాకు - తగినంత
- నూనె - 4 చెంచాలు
- జీలకర్ర - 1 చెంచా
- పసుపు - చిటికెడు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా
- కారం - 1 చెంచా
- ధనియాల పొడి - 1 చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:
- ముందుగా ఎండు రొయ్యలను శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని నిల్వ చేయడానికి ఉప్పు ఎక్కువగా వాడుతారు. ఇంకా వాటిని చెరువు నుంచి పట్టినప్పటి నుంచి క్లీన్ చేయరు కాబట్టి చక్కగా శుభ్రం చేసుకోవాలి.
- ఇందుకోసం వేడి నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టాలి.
- రొయ్యలు అటు నానుతుండగా, ఇటు గోంగూరను సన్నగా కట్ చేసుకోవాలి.
- స్టౌమీద కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న గోంగూర వేయండి.
- దీన్ని చక్కగా ఉడికించుకున్న తర్వాత రోట్లో వేసుకొని మెత్తని పేస్టులా నూరుకోవాలి. అంటే గోంగూర రోటి పచ్చడి మాదిరిగా రుబ్బాలి.
- ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన 2 స్పూన్ల ఆయిల్ వేయాలి.
- వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి చిటపడలాడించండి.

- ఆ తర్వాత నానబెట్టుకున్న రొయ్యలను ఈ తాళింపులో వేయాలి. అందులోనే పసుపు వేసి 3 నిమిషాలపాటు వేయించండి.
- ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి 5 నిమిషాలసేపు వేయించండి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు సుమారు 2 నిమిషాలపాటు కుక్ చేసుకోవాలి.
- అనంతరం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మిక్స్ చేయాలి. కారం, ధనియాల పొడి పచ్చివాసన పోయే దాకా కుక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత రుబ్బుకున్న గోంగూర పేస్ట్ వేయాలి. 2 నిమిషాలపాటు అందులోనే ప్రైచేసిన తర్వాత గ్లాసు నీళ్లు పోయాలి.
- పదార్థాలన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నుంచి 6 నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
- చివరగా ఒకసారి ఉప్పు సరిచూసుకొని, ఓకే అనుకుంటే దించేసుకోవడమే.
- అద్దిరిపోయే గోంగూర, ఎండు రొయ్యల కూర సిద్ధమైపోతుంది.
- తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తింటారు.
వాతావరణం మారింది - మునగాకుతో దుమ్ములేపే "కారం పొడి" చేసుకోండి - షుగర్ బాధితులకు దివ్యౌషధం!

