Dry Fish Chinta Chuguru Curry in Telugu : చాలా మంది చిన్న ఎండు చేపలతో టమోటా కర్రీ, పులుసు ఎక్కువగా చేస్తుంటారు. కారం, మసాలాలు సరిగ్గా వేస్తే ఈ రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా ఎండు నెత్తళ్లతో చింత చిగురు కర్రీ ట్రై చేశారా? ఎండు చేపలు చింత చిగురుతో చేసిన ఈ కూర వేడివేడి అన్నంలోకి పుల్లపుల్లగా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈజీగా ఎండు నెత్తళ్లు చింత చిగురు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఎండు చేపలు చింత చిగురు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
- ఎండు చేపలు - 100 గ్రాములు
- ఉల్లిపాయలు - 3
- పచ్చిమిర్చి - 4
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పసుపు - అరటీస్పూన్
- గరం మసాలా - అరటీస్పూన్
- జీలకర్ర పొడి - అరటీస్పూన్
- ధనియాల పొడి - టీస్పూన్
- కారం, ఉప్పు -రుచికి సరిపడా
- చింత చిగురు - కప్పు
- నూనె - 2 టేబుల్స్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్

"పాలక్ పుల్కా" ఇలా చేసి చూడండి - గంటల కొద్దీ మృదువుగా ఉంటుంది!
తయారీ విధానం
- ముందుగా ఎండు నెత్తళ్ల తల భాగం చించేసి తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో వేడివేడి నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆపై రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
- ఇలా ఎండు చేపలను వేడి నీటిలో నానబెట్టి శుభ్రం చేయడం వల్ల ఇసుక, దుమ్ము వంటివి తొలగిపోతాయి. అలాగే కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది.
- అలాగే కూరలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అనంతరం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. నూనె హీటయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేపండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి.
- ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి.
- అనంతరం నీటిలో శుభ్రంగా కడిగిన ఎండు నెత్తళ్లు వేసి బాగా కలపండి. ఓ రెండు నిమిషాల తర్వాత పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి.

- ఇప్పుడు టీ గ్లాసు నీళ్లు పోసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి.
- తర్వాత చింత చిగురు చేతితో నలిపి కూరలో వేసి బాగా కలపండి. ఈ కర్రీలోకి చింత చిగురు చివరిగానే వేసుకోవాలి. అప్పుడే కూర రుచిగా ఉంటుంది.
- చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే నోరూరించే ఎండు చేపలు చింతు చిగురు కర్రీ రెడీ.
వేడివేడి అన్నంతో ఈ ఎండు నెత్తళ్లు చింత చిగురు టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ ఎండు చేపలు చింత చిగురు కూర తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
పాకం పట్టకుండా "రవ్వ లడ్డూలు" - ఇలా చేయండి ఒకటికి రెండు తింటారు!
"టిఫిన్ సెంటర్ టమోటా చట్నీ" పల్చగా రావాలంటే! - ఈ సీక్రెట్ తెలిస్తే చాలు - ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు!