Dora Cake : సెలవుల్లో పిల్లలు చిరు తిండికోసం గోలగోల చేస్తుంటారు. అమ్మలకు సమయం లేక, ఇంట్లో ఏదీ చేసిపెట్టకుంటే దుకాణం వైపు వేలు చూపిస్తుంటారు. షాపులో వాళ్లు కొనుగోలు చేసేవన్నీ జంక్ ఫుడ్సే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా పూర్తయ్యే కేక్ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. కేవలం 5 నిమిషాల్లోనే ఇది పూర్తవుతుంది. మరి, ఈ రెసిపీ తయారీకి ఏమేం కావాలి? ఎలా ప్రిపేర్ చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- 1 కప్పు గోధుమ పిండి
- 1/2 కప్పు బియ్యం పిండి
- 2 స్పూన్ల మిల్క్ పౌడర్
- 1/2 స్పూన్ బేకింగ్ సోడా
- 1 స్పూన్ తేనె
- 1 కప్పు పాలు
- 2 బ్లాక్ చాక్లెట్స్

మైదా, పెరుగు, బేకింగ్ సోడా, ఎగ్స్ ఇవేమి లేకుండా - అద్దిరిపోయే "రవ్వ స్వీట్ కేక్"!
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో గోధుమ పిండి, బియ్యం పిండి, మిల్క్ పౌడర్ వేసి పాలు పోస్తూ మిక్స్ చేయాలి.
- కప్పు పాలు మొత్తం ఒకేసారి పోయకూడదు. అలా పోస్తే పిండి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. కొద్ది కొద్దిగా పోస్తూ స్మూత్‌గా మిక్స్ చేయాలి.
- తర్వాత తేనె, బేకింగ్ సోడా కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. మనం తయారు చేసేది కేక్ కాబట్టి, పిండి ఎంత స్మూత్‌గా ఉంటే కేక్ అంత చక్కగా వస్తుందని గుర్తుపెట్టుకోండి.
- పిండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు 2 బ్లాక్ చాక్లెట్స్ తీసుకోవాలి. మార్కెట్లో దొరికేవి ఏవైనా పర్వాలేదు.
- వాటిని ముక్కలుగా చేసుకొని ఒక చిన్న గిన్నెలో వేయాలి. గట్టిగా ఉన్న చాక్లెట్లను లిక్విడ్లోకి మార్చాలి. ఇందుకోసం స్టౌ మీద ఒక గిన్నె పెట్టి, అందులో కొన్ని నీళ్లు పోసి వేడి చేయాలి.

- నీళ్లు ఉడుకుతున్నప్పుడు, చాక్లెట్లు వేసిన చిన్ని గిన్నెను ఫ్లక్కర్ సాయంతో పట్టుకొని గిన్నె అడుగు భాగాన్ని ఆ వేడి నీళ్లలో ఉంచాలి. ఆ నీళ్ల వేడికి చిన్న గిన్నెలోని చాక్లెట్లు కరుగుతాయి. అంటే ఆవిరి మీద ఇవి క్రీమ్‌లా మారుతాయన్నమాట. (చాక్లెట్ గిన్నెను నేరుగా పొయ్యి మీద పెట్టకూడదు. మాడిపోతుంది)
- ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నాలుగు చుక్కల ఆయిల్ వేసి, టిష్యూ పేపర్‌తో క్లీన్ చేయాలి.
- ఆ తర్వాత చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని గరిటెతో డోరా కేక్ మాదిరిగా వేసుకోవాలి.

- గరిటెలోని పిండిని చాలా నెమ్మదిగా ఒకే చోట వేయాలి. అదే మెల్లగా రౌండ్ షేప్‌లో బన్ మాదిరిగా విస్తరిస్తూ పోతుంది. గరిటెలోని పిండి అదే జారుతూ పాన్‌లో పడిపోవాలి తప్ప, మనం చేతితో గరిటెను విదిలించడం చేయకూడదు.
- ఆ విధంగా గరిటెలోని పిండి మొత్తం మెల్లగా పాన్‌లో వేయడం పూర్తయిన తర్వాత మూత పెట్టి సరిగ్గా 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లోనే ఉంచాలని మరిచిపోకండి.
- ఇప్పుడు ఒకసారి మూత తీసి గరిటతో మెల్లగా కేక్‌ను టచ్ చేసి చూడాలి. పిండి అంటుకుంటే ఇంకా కుక్ కావాల్సి ఉందని అర్థం. మరికాసేపు మూతపెట్టి ఉంచండి.

- అంతే డోరా కేక్ అద్భుతంగా కుక్ అవుతుంది. ఇదే విధంగా అన్ని కేకులూ తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక కేక్‌ను ప్లేట్లోకి తీసుకొని, దానిపైన మనం చాక్లెట్లను కరిగించి సిద్ధం చేసుకున్న క్రీమ్‌ను వైట్ కలర్లో ఉన్న కేకు వైపు పూర్తిగా అప్లై చేయాలి.
- ఆ తర్వాత మరో కేక్ తీసుకొని క్రీమ్ పూసిన కేక్ మీద పెట్టి మెల్లగా ప్రెస్ చేస్తూ రెండు కేకులను అతికించండి.
- అంతే, చక్కటి డోరా కేక్ సిద్ధమైపోతుంది. ఈ కేక్‌ను పిల్లలు ఎంతో ఇష్టంగా లాగిస్తారు.
- మీకు నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేయండి. మీ పిల్లలకు తినిపించండి. బేకరీ కేక్స్ కన్నా, ఈ కేక్ ఎంతో హెల్దీగా ఉంటుంది.

బేకరీ కేక్‌తో పిల్లలకు ముప్పు - కుక్కర్లోనే హెల్దీ "రాగి కేక్" చేసి పెట్టండి! - ఈజీగా అయిపోతుంది