ఘుమఘుమలాడే "చికెన్ పచ్చడి" - ఈ పద్ధతిలో పెడితే భలే రుచి!
పక్కా కొలతలతో నోరూరించే 'చికెన్ పచ్చడి' - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

Published : September 14, 2025 at 5:26 PM IST
Homemade Chicken Pachadi Recipe : మనలో చాలా మందికి ఎన్ని కూరలు ఉన్నా మనసు పచ్చళ్ల మీదకే పోతుంది. ఆవకాయ, గోంగూర, నిమ్మకాయ, ఉసిరికాయ, టమాటా ఇలా ఏదైనా పచ్చడితో రెండు ముద్దలు తిన్నామంటే చాలు ఆహా అనిపించకమానదు. ఇక, అదే నాన్ వెజ్ పచ్చళ్లు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ ఎక్కువగా చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, కొన్నిసార్లు అంత పర్ఫెక్ట్గా కుదరదు. అంటే, ముక్క గట్టిపడటమో, లేదంటే పచ్చడి చేదు రావడమో జరుగుతుంటుంది. అందుకే, మీకోసం పర్ఫెక్ట్ కొలతలతో అద్దిరిపోయే "చికెన్ పచ్చడిని" తీసుకొచ్చాం. దీన్ని చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి అద్భుతమైన రుచినిస్తుంది. అంతేకాదు, ఈ పద్ధతిలో పెట్టారంటే చాలా రోజులు తాజాగా నిల్వ కూడా ఉంటుంది! మరి, పక్కా కొలతలతో ఘుమఘుమలాడే చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- ఒక కిలో - బోన్‌లెస్ చికెన్
- నూనె - 600ఎంఎల్
- కారం - 150 గ్రాములు
- మెత్తటి ఉప్పు - 60 గ్రాములు
- వెల్లుల్లిపాయలు - రెండు
- ఆవాలు - రెండు చెంచాలు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు చెంచాలు
- నిమ్మకాయలు - రెండు
- పసుపు - అర చెంచా
- మెంతులు - చెంచా
"మటన్ కర్రీ" ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టిందా? - ఇలా వెరైటీగా చేస్తే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్!

తయారీ విధానం :
- నోరూరించే ఈ చికెన్ పచ్చడి తయారీ కోసం ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పలుచని క్లాత్‌లో మూట కట్టి నీరు కారిపోయేలా జల్లి గిన్నెలో ఉంచాలి.
- అరగంట తర్వాత ఆ చికెన్‌ను ఒక పొడి క్లాత్‌పై పలుచగా పరచి ఎలాంటి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.

- ఆలోపు స్టవ్ మీద ఒక చిన్న కడాయిలో ఆవాలు, మెంతులను దోరగా వేయించి చల్లారాక మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి. అలాగే, వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తడి లేకుండా ఆరబెట్టుకున్న చికెన్, పసుపు, చెంచా ఉప్పు వేసి అవి చికెన్ ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ఉప్పు, పసుపు పట్టించిన చికెన్ ముక్కలను కొద్దికొద్దిగా వేసుకుంటూ దోరగా వేయించాలి. అలా చికెన్ ముక్కలన్నింటినీ వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- అనంతరం అదే నూనెలో ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్ద వేసి లో ఫ్లేమ్‌లో కాసేపు వేయించాలి.
- అది వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి రెండూ వేగాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు-మెంతుల పొడి, కారం, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలపాలి.

- ఆ మిశ్రమం చల్లారిన తర్వాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు, నిమ్మరసం యాడ్ చేసుకుని అంతా కలిసేలా బాగా కలియబెట్టాలి.
- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, చింతపండు వేస్తే నిల్వ వాసన వస్తుంది. అలాగే, త్వరగా బూజు పడుతుంది కనుక నిమ్మరసాన్ని ఉపయోగించాలి.
- అది పూర్తిగా చల్లారిన ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే స్పైసీ "చికెన్ పచ్చడి" మీ ముందు ఉంటుంది!
మిగిలిపోయిన ఇడ్లీలతో కమ్మని "స్నాక్" - పిల్లలైతే యమ్మీ యమ్మీ అంటూ తింటారు!
ఘుమాయించే "చికెన్ కర్రీ" - చల్లని వేళ వేడివేడి అన్నంలోకి అదుర్స్!

