రెస్టారెంట్ చెఫ్ చెప్తున్న "చిట్టి ముత్యాల పులావ్" - ఈ ట్రెండింగ్ రెసిపీని ఎవ్వరైనా చేసేయొచ్చు!
- బిర్యానీకన్నా ఈజీగా పులావ్ తయారీ - ఈ రుచికిి ఎవ్వరైనా సలామ్ కొట్టాల్సిందేనట!
Chicken Chitti Muthyalu (ETV Abhiruchi)

Published : July 27, 2025 at 9:24 AM IST
Chicken Chitti Muthyalu : ఎవర్ గ్రీన్ బిర్యానీని బీట్ చేసేలా ఇప్పుడు ఎక్కడ చూసినా "చిట్టిముత్యాల పులావ్" ఘుమాయిస్తోంది. కానీ, ఇంట్లో ప్రిపేర్ చేద్దామంటే రెస్టారెంట్ స్టైల్ రావట్లేదని చాలా మంది బాధ పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ రెసిపీని తీసుకొచ్చాం. అది కూడా ప్రముఖ రెస్టారెంట్ చెఫ్ తలారి రఘు వివరిస్తున్నారు. మరి, ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? చిట్టిముత్యాల పులావ్ వెనకున్న సీక్రెట్స్ ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం కేజీ
- చికెన్ కేజీ
- నెయ్యి 200 గ్రాములు
- నూనె 50 గ్రాములు
- లవంగాలు 8
- దాల్చిన చెక్క ముక్కలు 4
- యాలకులు 10
- మరాఠీ మొగ్గలు 4
- అనాస పువ్వు ఒకటి
- బిర్యానీ ఆకులు నాలుగైదు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ 4 చెంచాలు
- పచ్చిమిర్చి 6
- కశ్మీరీ కారం 2 చెంచాలు
- మామూలు కారం 2 చెంచాలు
- ధనియాల పొడి చెంచా
- జీలకర్ర పొడి చెంచా
- గరంమసాలా చెంచా
- చిన్న ఉల్లిపాయలు దోసెడు
- వంట సోంపు పొడి చెంచా
- గుప్పెడు కొత్తిమీర
- గుప్పెడు పుదీనా
- పెరుగు 150 గ్రాములు
తయారీ విధానం :
- అడుగు మందంగా ఉన్న పాత్రను పొయ్యిమీద నెయ్యి, నూనె వేయాలి
- నెయ్యి కాగిన తర్వాత లవంగాలు, దాల్చినచెక్క యాలకులు, మరాఠీ మొగ్గలు, అనాసపువ్వు వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలి.
- సరిగ్గా ఇప్పుడే పొట్టు మాత్రమే తీసి, కట్ చేయని దోసెడు చిన్న ఉల్లిపాయలు వేయాలి.
- అవి కాస్త ఉడకగానే అల్లం పేస్టు, పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత కశ్మీరీ కారం, మామూలు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా వేసేయాలి. వంట సోంపు పొడి కూడా ఒక స్పూన్ వేసి కలపాలి.
- కాసేపు తర్వాత పుదీనా, కొత్తిమీర, పెరుగును వేసి మిక్స్ చేయాలి.
- ఇప్పుడు.. చికెన్‌ను వేసి, సుమారు పది నిమిషాల సేపు సన్నని సెగ మీదనే ఫ్రై చేయాలి.
- ఈ టైమ్‌లో చికెన్ కుక్ అవుతూ అందులోంచి వాటర్ వస్తుంటుంది. ఆ నీళ్లు ఎంత ఉన్నాయో చూసుకొని, వాటిని కూడా అంచనా వేసి, కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోయాలి.
- వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. తక్కువైతే గింజ సరిగా ఉడకదు. ఎక్కువైతే మెత్తగా అయిపోతుంది.
- తగినంత ఉప్పు, నీళ్లపైన కాస్త నెయ్యి, 2 స్పూన్ల రోజ్‌వాటర్, పూర్తి నిమ్మకాయ రసం పిండాలి. స్లోగా కుక్ చేస్తేనే పులావ్ అద్భుతంగా వస్తుందని మరిచిపోవద్దు.
టిప్స్ :
- కుక్ చేసిన వెంటనే తినకూడదు. పై మూత కాస్త పక్కకు జరిగి ఒక అరగంటపాటు అలా వదిలేయాలి.
- అలా చేయడం ద్వారా పులావ్ లోని ఫ్లేవర్స్ చక్కగా సర్దుకుంటాయి.
- బిర్యానీ కన్నా చిట్టి ముత్యాల పులావ్ చేయడం ఈజీ. చికెన్ మారినేట్ అవసరం లేదు.
- ఉల్లిపాయలు చిన్నవే వాడాలి. పులావ్ రుచి అంతా అందులో ఉంది.
నోరూరించే "దాబా చికెన్" ఇంట్లోనే! - చిక్కని గ్రేవీతో భలే కమ్మగా ఉంటుంది!

