Green Chilli Powder Recipe : ఎండు మిర్చి, పల్లీలు, పప్పు దినుసులు, కరివేపాకు వేసుకుని కారం పొడి తయారు చేసుకోవడం తెలిసిందే. కానీ, ఇలా పచ్చి మిర్చి కారం పొడి ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలాంటి రెసిపీ ఎక్కడైనా టేస్ట్ చూశారా? ఇంట్లో చేసుకునే కారప్పొడుల్లో కంటే ది బెస్ట్ కారప్పొడి ఇదే! కాస్త నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోసెల్లోకి తింటుంటే ఇది ఎంతో బావుంటుంది. దీనిని నిల్వ చేసుకుని వాడుకోవచ్చు.
హనుమాన్ జయంతి స్పెషల్ "వడలు" - సింపుల్గా ఇలా చేసేసి నైవేద్యం పెట్టేయండి!
కావాల్సిన పదార్థాలు
- పుట్నాలు - 1 కప్పు (130 గ్రాములు)
- ఎండు కొబ్బరి - పావు కప్పు (40- 50 గ్రాములు)
- జిలకర - 1 టేబుల్ స్పూన్ (5-6 గ్రాములు)
- పచ్చి మిర్చి - 10-15 (70 గ్రాములు)
- కరివేపాకు - ఒక కప్పు (15 గ్రాములు)
- వెల్లుల్లి - పావు కప్పు (20 గ్రాములు)
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా స్టవ్ వెలిగించుకుని మందపాటి పెనం పెట్టుకోవాలి. పుట్నాలు, జీలకర్ర తొందరగా వేగిపోతాయి కాబట్టి అవి మాడిపోకుండా చూసుకోవాలి. పుట్నాలు సన్నటి మంటపై బాగా కలుపుతూ ఒక నిమిషం వేయించుకుంటే చాలు. ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లోకి ఎండు కొబ్బరి వేసుకుని దోరగా వేయించుకోవాలి. పచ్చిదనం పోయి కాస్త వేగితే చాలు తీసేసుకోవాలి. ఇపుడు స్టవ్ మంట కట్టేసి వేడి వేడి ప్యాన్లో జిలకర వేసుకుని పచ్చివాస పోయే వరకు వేయిస్తే చాలు. ప్యాన్ వేడికి జీలకర్ర వేగిపోతుంది కాబట్టి మంట అవసరం లేదు. కేవలం పచ్చివాసన పోయే వరకు వేయిస్తే చాలు! ఇపుడు పుట్నాలు, ఎండుకొబ్బరి, జీలకర్ర చల్లారనివ్వాలి.
- ముందుగా ఎండు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పుట్నాలు, జీలకర్ర కూడా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
- ఇపుడు పచ్చి మిర్చిని శుభ్రం చేసుకుని తడి లేకుండా బాగా తుడిచి పెట్టుకుని సన్నగా చీరుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పొడవుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంట తగ్గించుకుని పచ్చి మిర్చి వేసుకుని వేయించాలి. మంట మరీ ఎక్కువైతే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రంగు మారే వరకు సన్నటి మంటపై వేయించాలి. పచ్చి మిర్చి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ముందుగా శుభ్రం చేసుకుని ఆరబెట్టుకుని వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా క్రిస్పీగా వేగే వరకు సన్నటి మంటపై వేయించి పక్కకు పెట్టుకుని చల్లార్చుకోవాలి.
- ఇపుడు మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి పొట్టుతో సహా వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసుకున్న పుట్నాల పప్పు మిశ్రమంలో కలుపుకోవాలి. చేతితో నలుపుతూ కలుపుకుంటే పిండి, పచ్చిమిర్చి మిశ్రమం బాగా కలిసిపోతుంది. చివరగా కొద్దిగా రుచి చూసుకుని ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది.
గుంటూరు స్టైల్ "దొండకాయ కారం" - ఇలా చేస్తే ఎంతో స్పైసీగా ముద్ద కూడా మిగల్చరు!
పుల్లగా, కారంగా "పచ్చి మామిడి తాండ్ర" - నోటికి ఏమీ తినాలనిపించనపుడు ఇది తీసుకోండి!