CHICKEN PICKLE ONLINE : నాన్‌వెజ్ పచ్చళ్లు అంటే నోరూరిపోతుంది. కానీ, అవి కొనాలంటే మాత్రం చాలా ఖర్చవుతుంది. ఒకవేళ పచ్చడి కొన్నా వాటి నాణ్యత, రుచి విషయంలో కాంప్రమైజ్ కావాల్సిందే! చాలా మంది పచ్చళ్ల రుచి కోసం నూనె ఎక్కువగా కలుపుతుంటారు. అవి చెడిపోకుండా పైన పచ్చి నూనె కూడా పోస్తుంటారు. అలా కాకుండా ఇంట్లోనే తాజా పదార్థాలతో తయారు చేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. మీరు చికెన్ పచ్చడి చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఇలా పక్కొ కొలతలతో ట్రై చేసి చూడండి.
"ఫ్యామిలీ చికెన్ గ్రేవీ కర్రీ" - ఇలా లైట్‌గా దమ్ చేస్తే అందరికీ నచ్చుతుంది!

ఇలా చేయండి
- చికెన్ బ్రెస్ట్ పీస్ కంటే లెగ్ బోన్ లెస్ ముక్కలు బాగుంటాయి.
- తాజా మసాలాలు వాడడం వల్ల పచ్చడి రుచి బాగుంటుంది.
- పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం కలుపుకోవాలి.
- నాన్‌వెజ్ పచ్చళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం అంత మంచిది కాదు
కావాల్సిన పదార్థాలు
- బోన్ లెస్ చికెన్ - అర కిలో
- ఉప్పు - 1 టీ స్పూన్
- పసుపు - అర టీ స్పూన్
- జిలకర - అర టీ స్పూన్
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- ఆవాలు - అర టీ స్పూన్
- మెంతులు - పావు టీ స్పూన్
- యాలకులు - 3
- లవంగాలు - 4
- చెక్క - ఇంచు
- నూనె - 250 గ్రాములు
- కరివేపాకు - రెండు రెమ్మలు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్
- కారం - 50 గ్రాములు
- ఉప్పు - టేబుల్ స్పూన్ న్నర
- నిమ్మరసం - మూడు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా బోన్ లెస్ చికెన్ తెచ్చుకుని పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. బ్రెస్ట్ పీస్ కంటే లెగ్స్ పీస్ పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక కడాయి స్టవ్ పై పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పసుపు, ఉప్పు కలిపిన చికెన్ వేసుకోవాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుతూ ఉడికించుకుంటే చికెన్‌లో నీళ్లు ఊరుతాయి. ఊరిన నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ లోగా పచ్చడికి అవసరమైన పదార్థాలన్నీ కలిపి మసాలా పొడి తయారు చేసుకుందాం.

మసాలా పొడి కోసం
స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని జిలకర, ధనియాలు, ఆవాలు, మెంతులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని సన్నటి మంటపై దోరగా వేయించాలి. (ఒక వేళ మీరు కిలో చికెన్ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఈ మసాలా దినుసులను డబల్ చేసుకుంటే సరిపోతుంది) మసాలా దినుసులన్నింటినీ మంచి రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకుని చల్లార్చుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లోగా చికెన్ ముక్కల్లో నీళ్లన్నీ పోయి ఉడికిపోతుంది. ఇపుడు చికెన్ పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ముక్కలను చిన్నగా కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి.(చికెన్ ఉడికిపోతుంది కాబట్టి ముక్కలను చేతితో తుంచుకున్నా సరిపోతుంది)
పచ్చడి ప్రిపరేషన్ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని పావు లీటర్ నువ్వుల నూనె లేదా పల్లీ నూనె పోసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు గోల్డన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్క గట్టిపడిపోతుంది. లైట్ గా ఫ్రై చేసుకుంటే ముక్క జ్యూసీగా ఉంటుంది. ఈ సమయంలో రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే సమయంలోనే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నదైతే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా దంచుకుని చికెన్‌లో వేసుకోవాలి.
చికెన్ ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆర్పేసి కడాయి దించుకోవాలి. వేడి మీదనే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కారం అర కప్పు కారం లేదా 50 గ్రాముల కారం వేసుకోవాలి. టేబుల్ స్పూన్ న్నర ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు తగ్గించి వేసుకోవడం బెటర్. ఎక్కువైతే ఏమీ చేయలేం కాబట్టి తక్కువ వేసుకుని ఆ తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి. వేడి మీదనే కలుపుకొంటే చేదు వాసన అనిపిస్తుంది. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సమయంలో నూనె, ఉప్పు తక్కువైతే కలుపుకొంటే చాలు. ఈ పచ్చడిని సీసాలో నిల్వ చేసుకుంటే 3 నెలల పాటు తినేయొచ్చు.
చికెన్ ముక్క తెల్లగా ఉంటే నచ్చట్లేదా?! - ఎండు మిర్చి పేస్ట్‌తో "చిల్లీ చికెన్ కర్రీ" ఇలా చేయండి!
"చికెన్ పులుసు" చిక్కగా రావాలంటే కుక్కర్లో ఇలా చేయండి! - గ్రేవీ రుచికి ప్లేట్లు నాకేస్తారు!