CAPCICUM CHUTNEY : ఇడ్లీ, దోసెల్లాంటి టిఫిన్లలోకి ఎప్పుడూ పల్లీ చట్నీ, టమోటా చట్నీ మాత్రమే కాకుండా ఇలా కొత్తగా క్యాప్సికం చట్నీ చేసుకుని చూడండి ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త వేరుశనగలు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయలు కలిపి చేసుకునే ఈ క్యాప్సికం పచ్చడి ఒక్కసారి రుచి చూస్తే చాలు! మళ్లీ, మళ్లీ చేసుకుంటారు.
క్యాప్సికం చట్నీ టిఫిన్లలోకి మాత్రమే కాదు పునుగులు, రైస్, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. టమోటా, ఉల్లిపాయలు కూడా వేసుకునే ఈ చట్నీ మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది.
కమ్మటి "పచ్చి మామిడికాయ రసం" - ఈ సీజన్లో అస్సలు మిస్ కాకండి - సింపుల్‌గా ట్రై చేయండిలా!
కావాల్సిన పదార్థాలు
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చి శనగ పప్పు - 1 టేబుల్ స్పూన్
- మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ధనియాలు - 1 టీ స్పూన్
- పచ్చి మిర్చి - 10
- ఉల్లిపాయల తరుగు - 1 కప్పు
- పొడవుగా సన్నగా
- క్యాప్సికం - 2
- టమోటాలు -2
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీస్పూన్
- చింతపండు - కొద్దిగా
- కొత్తిమీర - కొద్దిగా
- 5 వెల్లుల్లి రెబ్బలు
తాలింపు కోసం
- మినప్పప్పు
- నూనె
- ఎండు మిర్చి
- ఆవాలు
- జీలకర్ర
- పచ్చిశనగపప్పు
తయారీ విధానం
- ముందుగా పొయ్యిమీద ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేయించుకోవాలి. అందులోనే పచ్చి శనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు సన్నటి మంటపై దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కగానే పచ్చి మిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని క్యాప్సికం, టమోటాలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, పసుపు వేసుకుని ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు మెత్తగా ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి.
- ఇపుడు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఆపై ఉడికించుకుని చల్లార్చుకున్న క్యాప్సికం, టమాట ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
- రెడీ చేసుకున్న చట్నీలోకి పోపు కోసం తాలింపు వేసుకోవాలి. నూనె, మినప్పప్పు, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుతో పాటు కరివేపాకు రెమ్మ వేసుకుని చిటపటలాడించి చట్నీలో కలుపుకుంటే సరిపోతుంది.
సూపర్ టేస్టీ "వెజ్ పులావ్" - వారానికోసారైనా ఇలా చేస్తే పిల్లలు మెతుకు మిగల్చరు!
టేస్టీ, హెల్దీ "రాగి పిట్టు" - ఈ బలమైన ఆహారం ఎవరైనా తినొచ్చు!