Cabbage Pickle Recipe in Telugu : సాధారణంగా పచ్చిమామిడికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ సీజన్లో ఆవకాయ పచ్చడి పెడుతుంటారు. ఆవాలు, మెంతుల పొడి, వెల్లుల్లి వంటి వివిధ పదార్థాలు వేసి చేసే ఆవకాయ పచ్చడి అందరికీ ఇష్టమే. అయితే, క్యాబేజీతో కూడా నిల్వ పచ్చడి చేయచ్చని మీకు తెలుసా? ఇక్కడ చెప్పిన విధంగా క్యాబేజీ పచ్చడి చేస్తే రెండు నెలలపాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంతో ఈ పచ్చడి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈజీగా క్యాబేజీ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
శ్రీవారి కళ్యాణోత్సవం, సేవల్లో పాల్గొంటారా? - తేదీలను ప్రకటించిన టీటీడీ!

క్యాబేజీ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు
- క్యాబేజీ తురుము - 500 గ్రాములు
- ఆవాలు - 100 గ్రాములు
- కారం - 100 గ్రాములు
- పసుపు - అరటీస్పూన్
- ఉప్పు - 100 గ్రాములు
- నువ్వుల నూనె - 300 గ్రాములు
- అరటీస్పూన్- నిమ్మ ఉప్పు ( లేదా సిట్రిక్ యాసిడ్/2 టేబుల్‌స్పూన్లు - నిమ్మరసం)
క్యాబేజీ నిల్వ పచ్చడి తయారీ విధానం :
- ముందుగా క్యాబేజీ పైన రెండు పొరలు తీసి సన్నగా నిలువు ముక్కలుగా తురుముకోండి. ఈ పచ్చడి కోసం క్యాబేజీ నీటితో కడగకూడదని గుర్తుంచుకోండి. వాటర్‌తో కడిగితే పచ్చడి త్వరగా పాడైపోతుంది.
- ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఆవాలు, అరటీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల వగరు రుచి రాదు.
- ఈ ఆవాల పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇందులో కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే ఈ స్టేజ్‌లోనే 2 టేబుల్స్పూన్ల మెంతి పిండి, టేబుల్‌స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు.

- అనంతరం సన్నగా తరిగిన క్యాబేజీ తురుము వేయండి. ఆపై కొద్దికొద్దిగా నువ్వుల నూనె పోసుకుంటూ చేతితో మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. మిగతా నూనెల కంటే నువ్వుల నూనె యాడ్ చేయడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
- తర్వాత అరటీస్పూన్ నిమ్మ ఉప్పు వేసి కలుపుకోండి. నిమ్మ ఉప్పు లేకపోతే సిట్రిక్ యాసిడ్ లేదా 2 టేబుల్‌స్పూన్లు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
- ఈ పచ్చడిని ఎయిర్‌టైట్ బాక్స్‌లోకి తీసుకొని రెండు రోజుల పాటు పక్కన పెట్టండి.
- ఆ తర్వాత మూత తీసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే క్యాబేజీ ఆవకాయ పచ్చడి రెడీ.
వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ క్యాబేజీ ఆవకాయ పచ్చడితో తింటే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. ఈ క్యాబేజీ పచ్చడి తయారీ విధానం నచ్చితే మీరు ట్రై చేయండి.
లంచ్ బాక్సుల్లోకి సూపర్ రెసిపీ - అన్నీ కలిపేసి కుక్కర్లో చేసుకోవడమే!
సామలతో "హెల్దీ ఇడ్లీ" ఇలా చేసుకోండి! - వీటిలో ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువే!