Biyyam Pittu Recipe In Telugu : బియ్యంతో చేసే మన సంప్రదాయ వంటకాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా బియ్యం పిండి పిట్టు ఒక చక్కటి వంటకం. ఆడపిల్లలు రజస్వల అయిన సమయంలో ఈ బియ్యం పిండి పిట్టు తినిపిస్తుంటారు. బెల్లం, బియ్యం పిండి, కొబ్బరి వంటి వాటితో చేసే ఈ పిట్టు ఆ సమయంలో వారు ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఈ బియ్యం పిండి పిట్టు ఆడ పిల్లలే కాకుండా ఎవ్వరైనా తినచ్చు. ఈ రెసిపీ తయారీలో బెల్లం ఉపయోగిస్తారు. బెల్లంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే, సింపుల్‌గా ఈ బియ్యం పిండి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బియ్యం పిండి పిట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
- బియ్యం - కప్పు
- తురిమిన బెల్లం - అరకప్పు
- ఎండుకొబ్బరి ముక్కలు - అరకప్పు
- యాలకులు - 4
- నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు

బొంబాయి రవ్వతో "కమ్మటి అప్పాలు" - స్వీట్ తినాలనిపిస్తే అప్పటికపుడు ఈజీగా చేసుకోండిలా!
బియ్యం పిండి పిట్టు తయారీ విధానం
- ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కప్పు బియ్యం తీసుకోండి. వీటిని రెండుమూడు సార్లు శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.
- అనంతరం ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం నీళ్లు వంపేసి తీసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి.
- మీరు పొడి బియ్యం పిండితో కూడా ఈ పిట్టు తయారు చేసుకోవచ్చు. అయితే, ఆ బియ్యం పిండి మరీ మెత్తటి పొడిలా కాకుండా కాస్త బరకగా ఉండాలి.
- పిట్టు చేయడం కోసం ఒక గిన్నె తీసుకోండి. ఇందులో గ్లాసు నీళ్లు పోసి పలుచటి తడి కాటన్ వస్త్రం ఉంచి దారంతో కట్టండి. వస్త్రంపై ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి వేసి లైట్‌గా ప్రెస్ చేయాలి. అనంతరం పిండిపై అక్కడక్కడా స్పూన్‌తో హోల్స్ చేయాలి. అనంతరం కాటన్ వస్త్రంతో పిండిని కప్పివేయాలి.

- ఇప్పుడు గిన్నెను స్టవ్‌పై పెట్టి స్టీమ్ పోకుండా దానిపై మరొక గిన్నెను పెట్టాలి.
- స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి బియ్యం పిండి పిట్టు 20 నిమిషాలు ఉడికించుకోండి.
- ఈ లోపు పిట్టులోకి కావాల్సిన కొబ్బరి పొడి కోసం ఒక మిక్సీ జార్లో అరకప్పు ఎండుకొబ్బరి ముక్కలు, యాలకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- పిట్టు చక్కగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని స్పూన్‌తో మ్యాష్ చేసుకోండి. అనంతరం ఇందులో అరకప్పు తురిమిన బెల్లం, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసి బాగా కలపండి. అనంతరం రెండు టేబుల్‌స్పూన్లు నెయ్యి వేసి అంతా కలిసేలా మిక్స్ చేయాలి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ బియ్యం పిండి పిట్టు రెడీ!
- ఈ బియ్యం పిండి పిట్టు తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
చుక్క నూనె అవసరం లేదు, స్టవ్‌తో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి"
ఉల్లి, వెల్లుల్లి, టమోటా లేకుండా "అద్దిరిపోయే కర్రీ"-చిక్కటి గ్రేవీతో కూర అన్నంలోకి చాలా బాగుంటుంది!