Betting Apps : ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను బెట్టింగ్ అంశం కుదిపేస్తోంది. వేలాది మంది పిల్లలు బెట్టింగ్‌కు బానిసలై లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. పదుల సంఖ్యలో అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరి పిల్లలు బాధితులుగా ఉన్నారో తల్లిదండ్రులకే చాలా మందికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు అప్రమత్తంగా ఉండాల్సిందే. అలా ఉండాలంటే అసలు బెట్టింగ్‌లోకి ఒక వ్యక్తిని ఎలా లాగుతారు? లాగిన తర్వాత ఏం జరుగుతుంది? చివరికి కథ ఎలా ముగుస్తుంది? అన్నది పూర్తిగా తెలుసుకోవాల్సిందే.
గాలం ఇలా వేస్తారు :

ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో ఒకటికి మించిన సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్‌కు ఇవే మెయిన్ ప్లాట్ ఫామ్స్. ఆయా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు (యాడ్స్) ఇస్తుంటాయి. బెట్టింగ్ పెట్టండి, నిమిషాల్లోనే లక్షలాది రూపాయలు గెలుచుకోండి అంటూ ఊరిస్తుంటాయి. ఈ పనికి సినిమా స్టార్లను, క్రికెటర్లను, ఇతర ప్రముఖులను ఉపయోగిస్తుంటాయి. సెర్చ్ ఇంజిన్లలో కూడా ఈ యాడ్స్ కనిపిస్తుంటాయి. దీంతో ఈజీ మనీ వైపు మొగ్గుచూపుతున్న యువతరం ఆ గాలానికి చిక్కుతారు.

యాప్ డౌన్‌లోడ్ చేస్తారు :
రెండో దశలో బెట్టింగ్ యాప్స్‌ను తమ ఫోన్ లో డౌన్‌లోడ్ చేసుకుంటారు. యాప్ స్టోర్, వెబ్‌సైట్, థర్డ్ పార్టీ సైట్ల నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. అందులో అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వ్యక్తిగత వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి అడిగినవన్నీ సమర్పించాలి. చివరగా షరతులన్నీ అంగీకరిస్తున్నానని బటన్ క్లిక్ చేస్తారు. ఆ తర్వాత డబ్బు చెల్లింపులు ఎలా చేస్తారో (క్రెడిట్/డెబిట్ కార్డ్, ఇ-వాలెట్‌లు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్) తెలియజేయాల్సి ఉంటుంది.
కాయ్ రాజా కాయ్ - బెట్టింగ్ షురూ :
ప్రవేశం పూర్తయిన తర్వాత ఇక బెట్టింగ్ లోకి దిగుతారు. ఆ యాప్‌ను బ్రౌజ్ చేసి అందులో ఏయే రకాల బెట్టింగ్‌లు అందుబాటులో ఉన్నాయో చూస్తారు. అవి క్రికెట్ వంటి క్రీడలు, కాసినో, ఇంకా ఎలక్షన్స్ ఫలితాలు ఇలా రకరకాల ప్లాట్ ఫామ్స్ ఉంటాయి. అందులో దేంట్లో బెట్టింగ్ పెడతారో సెలక్ట్ చేసుకుంటారు. ఎంత మొత్తం డబ్బు బెట్టింగ్ పెట్టాలో నిర్ణయించుకొని పందెం కాస్తారు. ఆ తర్వాత ఫలితాల కోసం వెయిట్ చేస్తుంటారు.
అంతా మోసం :

బెట్టింగ్ యాప్స్ మేజర్‌గా మూడు రకాలుగా జనాన్ని మోసం చేస్తుంటాయి. కొన్ని యాప్స్ మొదట నమ్మకం కలిగించేందుకు యూజర్లకు గెలుపు రుచి చూపిస్తాయి. అంతేకాదు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి ఊరించి, ముందుగా ఎక్కువ డబ్బును డిపాజిట్ చేయించుకుంటాయి. ఆ తర్వాత పలు రకాల కారణాలు చూపి డిపాజిట్ డబ్బును మోసగిస్తాయి.
మరికొన్ని యాప్స్ వ్యక్తిగత డేటాను చోరీ చేస్తాయి. అకౌంట్ క్రియేట్ చేసే సమయంలోనే యూజర్ల అతి సున్నితమైన పర్సనల్ సమాచారాన్ని కూడా తీసుకుంటాయి. ఆ తర్వాత ఫోన్ మొత్తం హ్యాక్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ వంటివి సేకరించి అకౌంట్ ఖాళీ చేస్తాయి. అంతేగాక సేకరించిన డేటాను ఇతరులకు విక్రయించడం ద్వారా దుర్వినియోగం చేస్తాయి.
మూడో రకం నకిలీ గేమింగ్ యాప్స్. ఇవి పూర్తిగా మోసగించేవి. ఇందులో ఆటలన్నీ ముందుగానే ప్రోగ్రామ్ చేసి ఉంటాయి. అందువల్ల యూజర్లు గెలవడం అసాధ్యం. ఫలితాలను యాప్ నిర్వాహకులు స్వయంగా డిసైడ్ చేస్తారు.

నిబంధనలు లేవా? :
జనాన్ని ఇంతగా మోసగించే ఈ బెట్టింగ్ యాప్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో పూర్తి నిషేధం ఉంది. ఇంకా పలు రాష్ట్రాలు కూడా నిషేధించాయి. అయినప్పటికీ ఆన్లైన్ ద్వారా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ఇలాంటి యాప్స్‌ను పేరు పొందిన సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్లతోపాటు కొందరు సినీ తారలు కూడా ప్రమోట్ చేశారు. ఈ యాప్స్ కు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలుమార్లు యువతకు సూచించారు. అయినప్పటికీ బెట్టింగ్ బారిన పడే కొత్తవాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు.
#SayNoToBettingApps @Cyberdost @AmitShah @narendramodi pic.twitter.com/zb1HYbXaKP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025
జీవితాలు సర్వ నాశనం :
బెట్టింగ్ యాప్స్ అనేవి ఊబి లాంటివి. ఒక్కసారి అందులోకి దిగితే ఇక బయటకు రావడం చాలా కష్టం. ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా, అప్పులు చేసి మరీ బెట్టింగ్ పెట్టే పరిస్థితికి దిగజారిపోతారు. కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతాయి. బెట్టింగ్ కు బానిసలుగా మారినవారు చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతున్నారు.
#SayNoToBettingApps https://t.co/reew5zFB2C
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 19, 2025
శిక్ష తప్పదు :
బెట్టింగ్ నిర్వహించిన వారు మాత్రమే కాకుండా ప్రమోట్ చేసినవాళ్లు కూడా శిక్షార్హులేనని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. అందువల్ల ఇలాంటి అక్రమ వ్యవహారాలకు అందరూ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.