హోటల్ స్టైల్ "రెడ్ చట్నీ" - ఏ టిఫెన్లోకైనా పర్ఫెక్ట్ - టేస్ట్ అదుర్స్!
దోశ, ఇడ్లీ, వడ అన్నింటిలోకి అద్దిరిపోయే చట్నీ - ఒక్కసారి తిన్నారంటే వారెవ్వా అనాల్సిందే!

Published : March 14, 2025 at 11:47 AM IST
Hotel Style Red Chutney at Home : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, ఇడ్లీ, వడ ఇలా రకరకాల రెసిపీలను ప్రిపేర్ చేసుకుంటుంటాం. ఈ క్రమంలోనే చాలా మంది వాటిల్లోకి పల్లీ, కొబ్బరి చట్నీ వంటి వాటిని ఎక్కువ తయారు చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకే రకం చట్నీలు కాకుండా ఈసారి కాస్త స్పెషల్‌గా ట్రై చేయండి. అదే, "హోటల్ స్టైల్ రెడ్ చట్నీ". మనం హోటల్స్‌కి వెళ్లినప్పుడు పల్లీ చట్నీతో పాటు ఈ చట్నీని ఇస్తుంటారు. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది! మరి, అలాంటి చట్నీని పర్ఫెక్ట్ టేస్ట్‌తో మీరే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఇంతకీ, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- మినపప్పు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 6
- అల్లం - చిన్న ముక్క
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఉల్లిపాయ - 1
- టమాటాలు - 3
- చింతపండు - కొద్దిగా
- జీలకర్ర - అరటీస్పూన్
- పుట్నాల పప్పు - 2 టేబుల్‌స్పూన్లు
తాలింపు కోసం :
- నూనె - కొద్దిగా
- పోపు దినుసులు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 1 రెమ్మ
- ఇంగువ - చిటికెడు
ఇదొక్కటి వేసి "పల్లీ చట్నీ" చేయండి - టిఫెన్స్లోకి పర్ఫెక్ట్ టేస్ట్‌తో అదుర్స్ అనిపిస్తుంది!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా టమాటాలు, ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మినపప్పు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి.
- అది వేగాక అందులో ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని కాస్త రంగు మారేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి మీ కారానికి తగినట్లు తీసుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక ఆ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి.
- ఆ తర్వాత మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే, టమాటాలు మెత్తగా మగ్గాలని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన టమాటా మిశ్రమం, జీలకర్ర, పుట్నాల పప్పు, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చట్నీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు పచ్చడిలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి తుంపలు వేసుకొని బాగా వేయించుకోవాలి.
- అవి వేగాక కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే హోటల్ స్టైల్ "రెడ్ చట్నీ" రెడీ!
- దీన్నే 'టమాటా ఎండుమిర్చి చట్నీ' అని కూడా అంటాం. మరి, నచ్చితే మీరూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ చట్నీని ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, వడ ఇలా దేనిలోకైనా సూపర్‌గా ఉంటుంది. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!
అసలైన "కొబ్బరి చట్నీ" చేసే పద్ధతి ఇదీ - వేళ్లు నాకేస్తారంతే!

